: ఇరాన్ తో అణు ఒప్పందం విషయంలో.. ట్రంప్ ను హెచ్చరించిన సీఐఏ డైరెక్టర్
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ను ఆ దేశ గూఢచార సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) డైరెక్టర్ జాన్ బ్రెన్నాన్ హెచ్చరించారు. ఇరాన్ తో ఉన్న అణు ఒప్పందాన్ని రద్దు చేస్తామంటూ ఎన్నికల ప్రచారం సమయంలో ట్రంప్ చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇరాన్ తో అణు ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే... ఆ దేశం అంతర్గతంగా అణ్వాయుధాల ఉత్పత్తిని పెంచుకుంటుందని బ్రెన్నాన్ హెచ్చరించారు. ఆ తర్వాత ఇరాన్ బాటలోనే మరికొన్ని దేశాలు కూడా వెళ్లే ప్రమాదం ఉందని ఆయన చెప్పారు. పొరుగు దేశాలతో సంబంధం లేకుండా ఆయా దేశాలు తమకు నచ్చిన రీతిలో వ్యవహరించే ప్రమాదం ఉందని తెలిపారు. సాధారణంగా సీఐఏ డైరెక్టర్ ఇలాంటి హెచ్చరికలు చేయడం చాలా అరుదు. అయితే, ఇరాన్ తో అణు ఒప్పందం అత్యంత చెత్త ఒప్పందం అంటూ ట్రంప్ ప్రచార సమయంలో చెప్పడంతో... ఒప్పందం రద్దు వల్ల జరిగే అనర్థాలను సీఐఏ డైరెక్టర్ ముందుగానే ట్రంప్ దృష్టికి తీసుకువచ్చినట్టున్నారు.