: భారతీయ విద్యార్థులకు న్యూజిలాండ్ వీసా నిబంధనలు కఠినతరం... సగానికి సగం వీసాల కోత
న్యూజిలాండ్ వెళ్లి చదువుకోవాలనుకుంటున్న భారతీయ విద్యార్థుల ఆశలపై ఆ దేశం నీళ్లు చల్లుతోంది. వీసా నిబంధనలను కఠినతరం చేయడమే కాక... వీసాల సంఖ్యలో కూడా సగానికి సగం కోత విధించింది. గత ఏడాది జూలై నుంచి అక్టోబర్ మధ్య కాలంలో మన విద్యార్థులకు 6,462 వీసాలను న్యూజిలాండ్ మంజూరు చేయగా... ఈ ఏడాది కేవలం 3,102 వీసాలను మాత్రమే మంజూరు చేసింది. భారతీయ విద్యార్థులకు వీసా నిబంధనలను ఎందుకు కఠినతరం చేశారో న్యూజిలాండ్ ప్రభుత్వ రేడియో వెల్లడించింది. న్యూజిలాండ్ కు వస్తున్న విద్యార్థులకు తగినంత డబ్బు, కావాల్సినంత ఇంగ్లీష్ పరిఙ్ఞానం ఉండటం లేదని... ఇలాంటి వారిని తమ దేశంలో అడుగుపెట్టకుండా నియంత్రిస్తున్నామని తెలిపింది. అయితే, ప్రభుత్వ నిర్ణయంపై అక్కడున్న 'అక్లాండ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ గ్రూప్' మండిపడింది. 16 ప్రైవేట్ విద్యాసంస్థల సమాహారమే ఈ గ్రూప్. ఈ సంస్థ ప్రతినిధి చాల్మర్స్ మాట్లాడుతూ, సమర్థులైన విద్యార్థులకు కూడా న్యూజిలాండ్ వీసా నిరాకరిస్తోందని ఆరోపించారు. న్యూజిలాండ్ ప్రభుత్వ నిర్ణయంతో... దేశంలోని విద్యాసంస్థలు దెబ్బతినే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.