: చిల్లర లేదంటూ ట్యాంక్ నిండా పెట్రోల్ కొడితే... బంకే మండి బుగ్గయింది!
పెద్ద నోట్ల రద్దు, చిల్లర కొరత ఒక్కోసారి ఎంతటి పెను ప్రమాదాలకు దారితీయవచ్చో తెలియజెబుతున్న ఘటన ఇది. కర్ణాటకలోని గుల్బర్గాలో ఓ పెట్రోలు బంకులో చిల్లర లభించని కారణంగా రూ. 500కు పెట్రోలు కొడుతుండగా, ట్యాంకు నిండి, పెట్రోలు బయట ఒలికింది. ఆపై బైక్ స్టార్ట్ చేయగానే మంటలు అంటుకున్నాయి. ప్రమాదం జరుగగానే బైక్ యజమాని దాన్ని వదిలేసి దూరంగా వెళ్లి ప్రాణాలు దక్కించుకున్నాడు. కిందపడ్డ బైక్ నుంచి పెట్రోల్ కారడంతో క్షణాల్లో మంటలు విస్తరించి, అందరూ చూస్తుండగానే పెట్రోలు బంకును పూర్తిగా దహనం చేసింది. మిగతావారు కూడా దూరంగా వెళ్లిపోయారు. ఈ ఘటనలో లక్షలాది రూపాయల ఆస్తినష్టం వాటిల్లింది. బంకులోకి బైక్ రావడం నుంచి పెట్రోల్ కొట్టడం మొదలు బంక్ కాలి బూడిద కావడం వరకూ సీసీ కెమెరాల్లో రికార్డుకాగా, ఇప్పుడు ఆ వీడియో వైరల్.