: తెలంగాణలో కనుమరుగు కానున్న ఎంసెట్.. రద్దు చేసే యోచనలో సర్కారు?
తెలంగాణలో ఎంసెట్ ఇక చరిత్రగా మిగిలిపోనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎంసెట్ రద్దు అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంజినీరింగ్ విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఎంసెట్‌తోపాటు జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలు రాస్తున్నారు. జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్‌లలో సీట్లు రాకపోతే విద్యార్థులు ఎంసెట్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇలా మూడు పరీక్షలు రాయడం వల్ల విద్యార్థులకు ఆర్థికభారంతోపాటు మానసికంగా కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ప్రబుత్వం భావిస్తోంది. అందుకే ఏకంగా ఎంసెట్‌ను ఎత్తివేసి సీబీఎస్ఈ నిర్వహించే మెయిన్ పరీక్షలో విద్యార్థులు సాధించిన ర్యాంకులను పరిగణనలోకి తీసుకుని ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలు కల్పించాలని యోచిస్తోంది. వచ్చే ఏడాది నుంచి మెడికల్ కాలేజీల్లో సీట్ల కోసం జాతీయ స్థాయిలో కేంద్రం నీట్‌ను నిర్వహించబోతోంది. ఇందులో ర్యాంకుల ఆధారంగానే మెడికల్ సీట్లను భర్తీ చేయనున్నారు. అలాగే జేఈఈ పరీక్షను ప్రాతిపదికగా తీసుకుని కళాశాలల్లో సీట్లు కేటాయించడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదని, చాలా రాష్ట్రాల్లో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా ఎంసెట్‌ను రద్దు చేస్తే మాత్రం ఇంటర్ మార్కులకు కల్పిస్తున్న 25 శాతం వెయిటేజీ ఉండకపోవచ్చు. మరోవైపు ఇంటర్ మార్కుల ఆధారంగానే సీట్లు భర్తీ చేస్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని కూడా విద్యాశాఖ పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ పధ్ధతి సరికాదని కాలేజీ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదనరెడ్డి పేర్కొన్నారు. ఒకవేళ ప్రభుత్వం జేఈఈ మెయిన్ ర్యాంకులను పరిగణనలోకి తీసుకుంటే విద్యార్థులు ఇంటర్‌లో పాస్ మార్కులకే పరిమితమయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం అనుకున్నట్టుగా జరిగితే వచ్చే ఏడాదే ఎంసెట్ రద్దు అయ్యే అవకాశం ఉంది.