: ఐఏఎస్ టాపర్ల ప్రేమ వివాహానికి అభ్యంతరం వ్యక్తం చేస్తున్న అఖిలభారత హిందూ మహాసభ జాతీయ కార్యదర్శి
ఐఏఎస్ ప్రేమ జంట మధ్యలో అఖిలభారత హిందూ మహాసభ జాతీయ కార్యదర్శి మున్నాకుమార్ శర్మ తలదూర్చడం వివాదం రేపేలా కనిపిస్తోంది. 2011 సివిల్స్ టాపర్ టీనా దాబీ, సెకండ్ ర్యాంకర్ అతహార్ ఆమిర్ ఉల్ షపీ ఖాన్ ముస్సోరి లోని లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ ఐఏఎస్ అకాడమీలో ట్రైనీగా చేరేముందు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో కలుసుకున్నారు. అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో వారిద్దరూ ప్రేమలో పడ్డారు. వారి ప్రేమకు ఇద్దరి కుటుంబాలు అంగీకారం తెలిపాయి. దీంతో తామిద్దరం వివాహం చేసుకుంటున్నామని ఆ జంట ప్రకటించింది. ఈ పరిణామం జాతీయ హిందూ మహాసభకు కోపం తెప్పించింది. హిందూ యువతిని ముస్లిం యువకుడు వివాహం చేసుకోకూడదని, అలా వివాహం చేసుకుంటే ఖాన్ ముందు హిందువుగా మారాలని డిమాండ్ చేస్తూ జాతీయహిందూ మహాసభ జాతీయ కార్యదర్శి మున్నాకుమార్ శర్మ ఐఏఎస్ టీనా దాబి తండ్రికి లేఖరాశారు. ఈ లేఖలో 'ప్రియమైన జశ్వంత్ దాబిగారూ, 2015 ఐఏఎస్ పరీక్షల్లో టాపర్ టీనా నిలవడాన్ని చూసి మేమంతా సంతోషించాం. ఖాన్ ను పెళ్లి చేసుకుంటానంటూ మీ అమ్మాయి చేసిన ప్రకటన మమ్మల్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ముస్లింలు లవ్ జిహాద్ ను వ్యాప్తి చేస్తున్న దశలో విద్యాధికులైన మీరు ఈ వివాహానికి అంగీకరించడం కాస్త బాధను కలిగించింది. హిందువుల అమ్మాయిలను ప్రేమ పేరుతో తమ మతంలోకి మార్చేందుకు ముస్లింలు వివాహం చేసుకుంటున్నారు. అలా కాకుండా వివాహం చేసుకోవడమే ఆ ఇద్దరికి ముఖ్యం అనిపిస్తే ముందు ఖాన్ ను మతం మారమని కోరండి. అతను మతం మారిన తరువాత మాత్రమే వివాహం జరపాలి' అని ఆయన లేఖలో కోరారు. దీంతో ఈ వివాదం ఎటు తిరగనుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.