: ప‌ట్టిపీడిస్తున్న చిన్న నోట్ల కొర‌త‌.. ప్ర‌జ‌ల ముందు జాగ్ర‌త్తే కార‌ణం


పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత పెరిగిన చిల్ల‌ర క‌ష్టాలు ఇప్ప‌ట్లో తీరేలా క‌నిపించ‌డం లేదు. అటు బ్యాంకుల్లోనూ డ‌బ్బుల్లేక ఇటు ఏటీఎంలూ వెక్కిరిస్తుండ‌డంతో సామాన్యులు ప‌డుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. మ‌రోవైపు క‌ష్ట‌కాలాన్ని అధిగ‌మించేందుకు వీలైనంత ఎక్కువగా డ‌బ్బులు పంపించాలంటూ ఆర్బీఐని రాష్ట్రాలు అర్థిస్తున్నాయి. సోమవారం నాటికి ఆర్బీఐ నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు రూ.10వేల కోట్లు వ‌చ్చి ఉండొచ్చనేది అంచ‌నా. ఆర్బీఐ నుంచి రాష్ట్రానికి అందిన సొమ్ములో ఎక్కువ‌శాతం రూ.2వేల నోట్లే ఉండ‌డంతో డ‌బ్బులున్నా చిల్ల‌ర స‌మ‌స్య మాత్రం తీర‌డం లేదు. దీంతో స్పందించిన ప్ర‌భుత్వం రూ.వెయ్యికోట్ల విలువైన చిన్న నోట్లు పంపించాల్సిందిగా ఆర్బీఐకి లేఖ‌రాసింది. దాదాపు దేశ‌మంతా ఇదే ప‌రిస్థితి ఎదుర్కొంటోంది. చిన్న నోట్లు అందించ‌లేక బ్యాంకులు కూడా చేతులెత్తేస్తున్నాయి. అయితే బ్యాంకుల్లో క‌నిపించ‌ని వంద నోట్లు ప్ర‌జ‌ల చేతుల్లో మాత్రం క‌నిపిస్తుండ‌డం విశేషం. నోట్ల ర‌ద్దు త‌ర్వాత ప్ర‌భుత్వం రూ.2వేల నోట్ల‌ను విడుద‌ల చేయడం, రూ.500 నోట్లు ఇప్ప‌టి వ‌ర‌కు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాక‌పోవ‌డంతో జాగ్ర‌త్త ప‌డిన ప్ర‌జ‌లు వంద‌నోట్ల విష‌యంలో చాలా అప్ర‌మ‌త్తంగా ఉన్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. ముందు జాగ్ర‌త్త‌లో భాగంగా వారు వంద నోట్ల‌ను త‌మ వ‌ద్ద అట్టేపెట్టుకున్నారు. ఖ‌ర్చుపెడితే క‌ష్ట‌మ‌నే ఉద్దేశంతో వంద నోట్లను భ‌ద్రంగా దాచుకోవ‌డంతో బ‌య‌ట చిల్ల‌ర స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్న‌ట్టు అధికారులు భావిస్తున్నారు. కాగా పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలోని వివిధ బ్యాంకుల్లో ప్ర‌జ‌లు రూ.35 వేల కోట్ల మేర‌కు పాత నోట్ల మార్పు, డిపాజిట్లు చేసినట్టు అంచ‌నా.

  • Loading...

More Telugu News