: ప్రధాని మోదీ ప్రచారానికి రోజుకు రూ.1.4 కోట్ల ఖర్చు


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరుతో కేంద్ర ప్రభుత్వం టీవీ, అంతర్జాలంతో పాటు పలు ఎలక్ట్రానిక్ మీడియాల్లో ప్రచార కార్యక్రమాల కోసం భారీ మొత్తంలో ఖర్చు చేసింది. మోదీ ప్రచారం కోసం చేసిన ఖర్చు అంశంలో సమాచార హక్కును వినియోగిస్తూ రఘువీర్ సింగ్ అనే సామాజిక కార్యకర్త వివరాలు కోరారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు ఆయన లేఖ రాయగా, తాజాగా స‌ద‌రు శాఖ వివ‌రాల‌ను తెలిపింది. కేవ‌లం టీవీ, అంతర్జాలంతో పాటు పలు ఇతర మీడియాల్లో ప్రచారం కోస‌మే కేంద్ర ప్ర‌భుత్వం 1100 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టిన‌ట్లు అందులో పేర్కొన్నారు. కాగా, మోదీ కోసం పత్రికల యాడ్స్‌కు, హోర్డింగ్‌లకు, బుక్‌లెట్స్‌ వంటి వాటికి పెట్టిన ఖ‌ర్చు ఇంత‌కు ప‌దిరెట్లు అధికంగానే ఉంటుంద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. 2014, జూన్ 1వ తేదీ నుంచి ఈ ఏడాది ఆగస్టు 31వ తేదీ వరకు మోదీతో చేసిన ఎల‌క్ట్రానిక్, ఇంట‌ర్నెట్ ప‌బ్లిసిటీ కోసం ఇంత మొత్తంలో ఖ‌ర్చు అయింది. స‌గ‌టున మోదీ ప్ర‌చారం కోసం రోజుకు రూ.1.4 కోట్లు ఖర్చు అయ్యాయి. ఇటీవ‌లే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ త‌న స‌ర్కారు ప్రచారం కోసం రోజుకు రూ.16 లక్షలు ఖ‌ర్చు పెడుతున్నార‌ని వెల్ల‌డైంది. ఆ స‌మ‌యంలో బీజేపీ నేత‌లు కేజ్రీవాల్ పై విమ‌ర్శ‌లు గుప్పించారు. తాజాగా వెల్ల‌డైన మోదీ వివ‌రాలపై ప్ర‌తిప‌క్ష నేత‌లు ఏ స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తారో చూడాలి.

  • Loading...

More Telugu News