: మా బోయ్స్ బాగా ఆడారు... గెలుస్తామని అనుకోలేదు: కోహ్లీ
టీమిండియా సహచరులు బాగా ఆడారని కెప్టెన్ కోహ్లీ కితాబునిచ్చాడు. మూడో టెస్టులో విజయం సాధించిన అనంతరం కోహ్లీ మాట్లాడుతూ, ప్రధానంగా పేసర్లు అద్భుతంగా రాణించారని అన్నాడు. పిచ్ లో టర్న్ సాధ్యం కానప్పుడు బంతిని స్వింగ్ చేస్తూ పేస్ ను రాబట్టారని చెప్పాడు. ముఖ్యంగా ప్రధాన పేసర్ షమీ బంతిని స్వింగ్ చేయడం, పేస్ రాబట్టడం, సందర్భానుసారం బౌన్సర్లు సంధించడం తమకు బాగా కలిసి వచ్చిందని చెప్పాడు. గాయం నుంచి కోలుకున్న అనంతరం షమీ అద్భుతంగా రాణిస్తున్నాడని తెలిపాడు. జడేజా చేసిన 90 పరుగులు జట్టును ఆధిక్యంలో నిలిపాయని చెప్పాడు. కరణ్ నాయర్ కు సరైన అవకాశం కల్పించలేకపోయానని తెలిపాడు. జట్టులో ఆటగాళ్లంతా రాణిస్తున్నారని, ఇలాంటి సమయంలో జట్టు కూర్పు మార్చాలనే ఆలోచన తనకు లేదని కోహ్లీ స్పష్టం చేశాడు. టాస్ ఓడిపోవడంతో ఈ మ్యాచ్ గెలుస్తామని అనుకోలేదని, డ్రాగా ముగుస్తుందని భావించానని, సహచరులు రాణించడంతో, ఎవరి పాత్రను వారు సమర్థవంతంగా పోషించడంతో విజయం సాధించి, సిరీస్ లో ఆధిక్యం సాధించామని కోహ్లీ తెలిపాడు. మిగిలిన టెస్టుల్లో కూడా విజయం సాధించాలనే లక్ష్యంతో దిగుతామని తెలిపాడు.