: సబ్ కమిటీ బాధ్యతలు చంద్రబాబుకు అప్పగించడమంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లే: వైఎస్సార్సీపీ
పెద్దనోట్ల రద్దు అనంతరం నెలకొన్న ఇబ్బందులను అధిగమించే క్రమంలో ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిపి ఏర్పాటు చేసిన సబ్ కమిటీకి చంద్రబాబును చైర్మన్ గా నియమించడం అంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లే అని వైఎస్సార్సీపీ నేత వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఆడియో, వీడియో టేపులు, విదేశాలలోని నల్లధనం గురించి కేంద్ర ప్రభుత్వానికి పట్టదా? అని ఆమె ప్రశ్నించారు. పెద్దనోట్ల రద్దు విషయమై ప్రశ్నించాల్సిన చోట నోరెత్తని చంద్రబాబు, బ్యాంకర్లపై మాత్రం మండిపడుతున్నారని అన్నారు. మరో నాలుగు రాష్ట్రాల్లో తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించేందుకే చంద్రబాబు ఈ సబ్ కమిటీకి సారథ్యం వహిస్తున్నారని ఆమె ఆరోపించారు. కాగా, పెద్దనోట్ల రద్దు అనంతరం నెలకొన్న ఇబ్బందులను అధిగమించే క్రమంలో 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సబ్ కమిటీ వేస్తున్నామని... ఆ కమిటీకి సీఎం చంద్రబాబును నేతృత్వం వహించాలని కోరుతూ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ నిన్న ఫోన్ చేశారు.