: బ్లాక్ అండ్ వైట్ షర్ట్ ధరించి పార్లమెంట్ ఆవరణలో ఎంపీ శివప్రసాద్ వినూత్న నిరసన
పెద్దనోట్లను రద్దు చేసి మూడు వారాలు గడిచినప్పటికీ ప్రజలకు నగదు కొరత తీరలేదు. ప్రజలు పడుతున్న కష్టాలపై టీడీపీ ఎంపీ శివప్రసాద్ ఈ రోజు పార్లమెంటు ఆవరణలో తనదైన శైలిలో నిరసన తెలియజేశారు. నోట్ల రద్దుతో నల్లకుబేరులకు నష్టం లేదని, వైట్ మనీ ఉన్నవాళ్లే కష్టాలు పడుతున్నారని ఆయన బ్లాక్ అండ్ వైట్ కలర్ షర్ట్ ధరించి పార్లమెంటు ప్రాంగణంలోకి వచ్చారు. ఈ షర్టు ధరించే సభలోకి వెళతానని చెప్పారు. నరేంద్ర మోదీకి క్యూలో నిలబడి ఓట్లు వేస్తే ఇప్పుడు ఆయన ప్రజలను బ్యాంకుల ముందు క్యూలో నిలబెడుతున్నారని పేర్కొన్నారు. మోదీ తీసుకున్న నిర్ణయంపై శివప్రసాద్ విమర్శలు గుప్పించారు. నల్లకుబేరులు ఆనందంగానే ఉన్నారని, పేదవారే ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని చెప్పారు. ఓ కళాకారుడిగా ప్రజల ఆవేదనను తెలియజేస్తున్నానని అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పుని సరిదిద్దుకోవాలని సూచించారు. మోదీ తీసుకున్న నిర్ణయాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. పార్లమెంటుకి తాను ఓ కళాకారుడిగా వచ్చానని, పేదలకి కష్టాలు వచ్చినప్పుడు తాను ఇలాగే అడుగుతానని చెప్పారు. ముఖ్యమంత్రుల కమిటీకి సారథ్యం వహించడానికి చంద్రబాబు నాయుడు ఎందుకు ఒప్పుకుంటున్నారో తనకు అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబును కూడా ఈ పాపంలోకి తోసేస్తారని తనకు భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు.