: నోట్ల రద్దు ప్రభావం.. వరుసపెట్టి లొంగిపోతున్న మావోయిస్టులు
నోట్ల రద్దు మావోయిస్టులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఎన్నడూ లేనంతంగా ఒక నెలలో అత్యధికంగా 564 మంది మావోలు లొంగిపోవడం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా చెబుతున్నారు. మామూలుగా చత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్‌లలో కూంబింగ్‌లు జరుగుతుండడం పరిపాటి. అడపాదడపా ఎన్‌కౌంటర్లలో మావోయిస్టులు హతమవుతున్నారు. ఇటీవల ఏఓబీలో జరిగిన ఎన్‌కౌంటర్లో భారీసంఖ్యలో మావోలు హతమయ్యారు. అయితే ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేసిన తర్వాత 28 రోజుల్లో ఏకంగా 564 మంది లొంగిపోయారు. వీరిలో 469 మంది మావోయిస్టు సానుభూతిపరులు కావడం గమనార్హం. 70 శాతం లొంగుబాట్లు మల్కన్ గిరి జిల్లాలో జరగడం విశేషం. ఇక్కడే ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో 23 మంది మావోయిస్టులు హతమయ్యారు. మావోయిస్టులు లొంగిపోతుండడానికి అభివృద్ధి ఒక కారణంగా కాగా, నోట్ల రద్దు మరో కారణమని పోలీసు అధికారులు చెబుతున్నారు. తమ వద్ద ఉన్న రద్దయిన నోట్లు మార్చుకునే వీలు లేకపోవడం, డబ్బులు లేకపోవడంతో నిత్యావసరాలు తీర్చుకోలేకపోతుండడంతో మరో దారిలేక వారు లొంగిపోతున్నట్టు చెబుతున్నారు. స్థానిక కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తలు, సానుభూతిపరుల సాయంతో పాతనోట్లను మార్చుకోవాలని మావోలు ప్రయత్నిస్తున్నారని డీజీ, ఐజీల కాన్ఫరెన్స్‌లో హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. నోట్ల రద్దుతో వారి ఉనికికే ప్రమాదం ఏర్పడిందని పేర్కొన్నారు. నోట్ల రద్దుతో వారు పీకలోతు కష్టాల్లో కూరుకుపోయారని, వారితో కలిసి ఉండడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని సానుభూతిపరులు నమ్ముతున్నారని సీఆర్‌పీఎఫ్ డైరెక్టర్ జనరల్ దుర్గా ప్రసాద్ పేర్కొన్నారు. నోట్ల రద్దుతో మావోల్లో కలవరం మొదలైందని, వేర్వేరు ప్రాంతాలకు తరలిపోతున్నారనడంలో ఎటువంటి సందేహం లేదని ఆయన వివరించారు.