: విద్యార్థులు మునిగిపోయిన కేసులో నందిగామ కోర్టు సంచలన తీర్పు
కార్తీక మాసంలో పిక్నిక్కు వచ్చి మున్నేరులో మునిగిపోయి 15 మంది విద్యార్థులు మృతి చెందిన కేసులో కృష్ణా జిల్లా నందిగామ కోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. నిందితులకు రెండేళ్ల జైలు శిక్ష విధించడంతోపాటు 15 బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ఆదేశించింది. నవంబరు 27, 2005లో రవీంద్రభారతి పబ్లిక్ స్కూలు యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి మొత్తంగా 430 మంది విజయవాడ నుంచి కంచికచర్ల మండలంలోని కీసర వెళ్లారు. ఈ సందర్భంగా పక్కనే ఉన్న మున్నేరులో స్నానాలు చేసేందుకు వెళ్లిన విద్యార్థుల్లో 15 మంది నీటిలో మునిగి మృతి చెందారు. ఈ ఘటనపై స్కూల్ కరస్పాండెంట్ వీరమాచినేని వెంకటేశ్వరరావు సహా ఏడుగురిపై కేసులు న మోదయ్యాయి. వారిపై నమోదైన అభియోగాలు రుజువు కావడంతో సోమవారం కోర్టు శిక్షలు ఖరారు చేసింది. దోషులకు రెండేళ్ల జైలు శిక్షతోపాటు రూ.10 వేల చొప్పున జరిమానా విధించింది.