: పాక్ కిరాతకంపై లభ్యమైన సాక్ష్యాలు.. ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్న ఆర్మీ
మచ్చిల్ సెక్టార్‌లో గతవారం పాక్ పాల్పడిన కిరాతకానికి సంబంధించిన బలమైన సాక్ష్యాలను భారత్ సంపాదించింది. ఘటనా స్థలం నుంచి పాక్ మార్కింగ్‌తో ఉన్న ఆహారం, గ్రనేడ్లు, అమెరికా మార్కింగ్‌తో ఉన్న నైట్ విజన్ పరికరాలు, రేడియో సెట్ల ఫొటోలను సేకరించినట్టు నార్తరన్ ఆర్మీ కమాండ్ తెలిపింది. ఈనెల 22న మచ్చిల్ సెక్టార్‌లో పాకిస్థాన్ జరిపిన కాల్పుల్లో ముగ్గురు భారత జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా ఛిద్రమైన ఓ సైనికుడి మృతదేహాన్ని భారత ఆర్మీ గుర్తించింది. ఈ ఘటన వెనక పాక్ ఆర్మీ వెన్నుదన్నుగా నిలిచే బోర్డర్ యాక్షన్ టీం(బీఏటీ) ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. మచ్చిల్ ఘటనకు ప్రతీకారం తీవ్రస్థాయిలో ఉంటుందని హెచ్చరించిన భారత్ చెప్పినట్టుగానే 24 గంటలు కూడా గడవకముందే ప్రతీకారం తీర్చుకుంది. 23వ తేదీన 16 పాకిస్థాన్ ఆర్మీ పోస్టులపై దాడులు చేసింది. కాల్పులతో పాక్‌ను చావుదెబ్బ తీసింది.