: స్థానిక ఎన్నికల్లో బీజేపీ జయభేరి.. కనిపించని నోట్ల రద్దు ప్రభావం
నోట్ల రద్దుపై విపక్షాలు నానా యాగీ చేస్తున్నా ప్రజలు ఆ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదని మహారాష్ట్రలో రుజువైంది. రాష్ట్రంలోని 147 మున్సిపల్ కౌన్సిళ్లు, 17 నగర పంచాయతీల పరిధిలోని 3705 సీట్లకు ఆదివారం ఎన్నికలు నిర్వహించారు. సోమవారం ఓట్లు లెక్కించారు. రాత్రి కడపటి వార్తలు అందేసరికి బీజేపీ 851 స్థానాల్లో విజయ భేరి మోగించింది. శివసేన 514, ఎన్సీపీ 638, కాంగ్రెస్ 643, ఎంఎన్ఎస్ 16, బీఎస్పీ 9, గుర్తింపు లేని పార్టీలు 119, స్థానిక కూటములు 384, సీపీఎం 12, స్వతంత్రులు 324 స్థానాల్లో విజయం సాధించారు. రాత్రి పొద్దుపోయే సమయానికి 3510 సీట్ల ఫలితాలు రాగా, మిగతా వాటిలో లెక్కింపు కొనసాగుతోంది. ఈ ఫలితాలపై ప్రధాని మోదీ స్పందించారు. ఇది పేదల గెలుపని అభివర్ణించారు. అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారని తెలిపారు. ఈ సందర్భంగా పార్టీని విజయపథంలో నడిపించిన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ను అభినందించారు. దేశ హితం కోసం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు స్వాగతించారని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదని, ప్రతిపక్షాలు ఇకనైనా కళ్లు తెరవాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా హితవు పలికారు.