: విత్‌డ్రాయల్ పరిమితికి మించి తీసుకునే వెసులుబాటు.. షరతులు వర్తిస్తాయి!
నోట్ల రద్దుతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కొంత ఊరటనిచ్చేలా ప్రభుత్వం మరో ప్రకటన చేసింది. అయితే ఇందుకు కొన్ని షరతులు కూడా విధించింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకులో పాత నోట్లను జమచేస్తున్నవారు తప్ప కొత్త నోట్లను డిపాజిట్ చేసే వారే కరువయ్యారు. ఫలితంగా నగదు చలామణిలో స్తబ్ధత చోటుచేసుకుంది. దీంతో డిపాజిట్లను ప్రోత్సహించేందుకు ఆర్బీఐ సరికొత్త నిర్ణయం తీసుకుంది. రద్దయిన పాతనోట్లు, చిన్ననోట్లు, కొత్త నోట్లు కలిపి బ్యాంకులో జమ చేస్తే విత్‌డ్రాయల్ పరిమితికి మించి తీసుకోవచ్చని రిజర్వు బ్యాంకు తాజాగా ప్రకటించింది. అంటే కొత్త రూ.2 వేల నోటు, రద్దయిన పాత రూ.500 నోట్లు, చిన్న నోట్లు కలిపి ఓ రూ.4వేలు జమచేశారనుకుంటే వారంలో రూ.24కు అదనంగా మరో రూ.4వేలు డ్రా చేసుకోవచ్చన్నమాట. రూ. 10వేలు డిపాజిట్ చేస్తే కనుక రూ.24 వేలకు అదనంగా మరో రూ. పదివేలు తీసుకునేలా వెసులుబాటు కల్పించింది. నేటి నుంచే(మంగళవారం) ఇది అమల్లోకి వస్తుందని ఆర్బీఐ పేర్కొంది. ఆర్బీఐ నిర్ణయం బాగున్నా షరతులపై ప్రజలు మండిపడుతున్నారు. బ్యాంకులో సొమ్ము వేసుకోవడం, తిరిగి తీసుకోవడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే డబ్బుల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నామని, మళ్లీ కోరి కష్టాలు తెచ్చుకోలేమని చెబుతున్నారు.