: మీడియా బాగా పని చేయాలి... భయాలు కల్పించవద్దు!: కేసీఆర్
ఇది క్లిష్ట సమయమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఇలాంటి సమయంలో మీడియా సహకరించి, బాగా పని చేయాలని అన్నారు. ప్రజలను భయబ్రాంతులకు చేయకుండా కథనాలు ప్రచురించాలని సూచించారు. మీడియా, ప్రభుత్వం కలిసి పని చేయాలని ఆయన సూచించారు. నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించాలని, వీలైనంత త్వరగా ప్రారంభించాలని తెలిపారు. మూడు నాలుగు రోజుల్లో టీఎస్ వ్యాలెట్ సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన చెప్పారు. ఆధార్ కార్డ్ డేటాను రాష్ట్రాలకు అందుబాటులో ఉంచాలని కేంద్రానికి చెప్పామని ఆయన తెలిపారు. బ్యాంకు ఖాతాలు లేని వారికి అకౌంట్లు ఓపెన్ చేయాలని అన్నారు. దీనికి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. సిద్ధిపేట జిల్లాలోని సిద్ధిపేట నియోజకవర్గాన్ని ప్రయోగాత్మకంగా మోడల్ గా తీసుకుని 100 శాతం క్యాష్ లెస్ నియోజకవర్గంగా చేయాలని నిర్ణయించామని ఆయన చెప్పారు. బ్యాంకులు కూడా సహకరిస్తామని చెప్పాయని ఆయన తెలిపారు. ఇందులో మొదట్లో 500 రూపాయలు మాత్రమే వినియోగించుకునేలా చర్యలు చేపడతామని, ఆ తరువాత నెమ్మదిగా అవి కూడా లేకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఎవరూ నల్లధనం వెనుకేసుకోలేని భారతదేశాన్ని నిర్మించడంలో తెలంగాణ మద్దతు ఉంటుందని ఆయన చెప్పారు.