: ఆర్బీఐ నుంచి బ్యాంకులకు చేరని కరెన్సీ... అన్ని బ్యాంకుల ముందూ ప్రజల పడిగాపులు.. అసహనంతో వాగ్వాదాలు!


శని, ఆదివారాల్లో బ్యాంకు సెలవుల కారణంగా ఏ విధమైన ఆర్థిక లావాదేవీలనూ చేయలేకపోయిన ప్రజలు, సోమవారం నాడు ఆశగా బ్యాంకుల వద్దకు వెళ్లి, అధికారులు చెప్పిన మాట విని ఉసూరుమని వెనక్కు తిరుగుతున్నారు. ప్రధాన నగరాల్లోని ఏ బ్యాంకు శాఖలకూ కూడా ఆర్బీఐ నుంచి నగదు ఇంకా చేరలేదు. బ్యాంకులు తీయగానే విత్ డ్రా చేసుకోవాలని భావించి ఉదయం 8 గంటల నుంచే కాపుకాసిన ప్రజలు, 9 గంటల తరువాత, నగదు ఇంకా రాలేదని, ఎప్పుడు వస్తుందో తెలియదని అధికారులు చెప్పిన మాటలు విని అసహనానికి గురై, వారితో వాగ్వాదానికి దిగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే రెండు రోజులుగా బ్యాంకులు, ఏటీఎంలు పనిచేయడం లేదు. ఈ నేపథ్యంలో నేడు కూడా చేతికి నాలుగు రూపాయలు చిక్కకుంటే, సామాన్యుల కష్టాలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, నగదు లేకుంటే, బ్యాంకులను మూసేసి వెళ్లిపోవాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది. బ్యాంకులు తెరచి డబ్బు లావాదేవీలు జరగకుంటే, ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందన్న అనుమానంతోనే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News