: ఆగిన వ్యాపారం, జరగని వాణిజ్యం - ఆసుపత్రి లేదు, ప్రయాణం లేదు... దేశమంతా ఇదే స్థితి!
ఇండియాలో వ్యాపార లావాదేవీలు స్తంభించిపోయాయి. ఒక్క రూపాయి విలువైన వాణిజ్యం కూడా నమోదు కాని పరిస్థితి. ఏం కొనాలన్నా చేతిలో చిల్లి గవ్వలేక, ఉన్న రూ. 2 వేల నోటుకు చిల్లరిచ్చే నాథుడు కరవై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏటీఎంలు అలంకార ప్రాయాలుగా మారాయి. దేశంలోని 80 శాతం ఏటీఎంల ముందు 'నో కరెన్సీ' బోర్డులు కనిపిస్తుండగా, మిగిలిన వాటి ముందు వందల సంఖ్యలో ప్రజలు క్యూ కట్టిన పరిస్థితి. గడచిన రెండు రోజులుగా బ్యాంకులు పని చేయక పోవడం, ఏటీఎంలలో కరెన్సీని నింపే థర్డ్ పార్టీ చెస్ట్ లకు ఆర్బీఐ, బ్యాంకుల నుంచి నగదు రాకపోవడంతో ఎక్కడికక్కడ ఏటీఎంలు ఖాళీగా కనిపిస్తున్నాయి. బ్యాంకులు పనిచేయక, డబ్బు విత్ డ్రా చేసుకునేందుకు మార్గం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోలు బంకులు, బిగ్ బజార్ స్టోర్లు తదితర చోట్ల పీఓఎస్ (పాయింట్ ఆఫ్ సేల్స్) మెషీన్ల నుంచి డబ్బు విత్ డ్రా చేసుకునే అవకాశాలు ఉన్నా, వారు సైతం తమ వద్ద చిల్లర లేదని తప్పించుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏ పెట్రోలు బంకులోనూ కార్డును స్వైప్ చేసుకుని నగదు ఇవ్వడం లేదని తెలుస్తోంది. మొన్నటి వరకూ గృహోపకరణాలు, విలువైన వస్తువులు, స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు పడిపోయాయన్న వార్తలు రాగా, నిన్న, ఇవాళ కూరగాయల మార్కెట్ కు సైతం ప్రజలు వెళ్లని స్థితి. ఇంటికి కావాల్సిన నిత్యావసర సరుకులు, బియ్యం పప్పు, ఉప్పు వంటివాటిని అప్పిచ్చే స్టోర్ కోసం వెతకాల్సిన పరిస్థితి. ఇక అత్యవసర వైద్య సేవలు లభించడం సాధారణ ప్రజలకు దుర్లభం కాగా, ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రయాణాలను సైతం ప్రజలు రద్దు చేసుకుంటున్న వైనం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. బ్యాంకులు సోమవారం నాడు తెరచుకున్నప్పటికీ, మధ్యాహ్నం తరువాత మాత్రమే కరెన్సీ అందుతుందని తెలుస్తోంది. ఆపై సోమవారం సాయంత్రానికి కొన్ని ఏటీఎంలకు నగదు చేరే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.