: నోట్ల రద్దుతో సమస్యలు వస్తాయని ముందే చెప్పానుగా!: మోదీ


ఓ మంచి నిర్ణయం తీసుకున్న వేళ, దాన్ని అమలు చేయడంలో కొన్ని కష్టాలను ఎదుర్కోక తప్పదని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ఆల్ ఇండియా రేడియో మాధ్యమంగా 'మన్ కీ బాత్'లో మాట్లాడుతూ, నోట్ల రద్దుతో సమస్యలు వస్తాయని తనకు ముందే తెలుసునని మోదీ అన్నారు. ఈ విషయాన్ని తాను ముందే వెల్లడించి, ప్రజలను అప్రమత్తం చేశానని, మొత్తం రద్దు ప్రక్రియ పూర్తయ్యేందుకు 50 రోజులైనా పడుతుందని వెల్లడించానని అన్నారు. ఇండియాను 70 సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న వ్యాధికి చికిత్స అంత సులువుగా రాదని అన్నారు. నల్లధనం రుగ్మతను పూర్తిగా తొలగించే వరకూ తాను నిద్రపోనని తెలిపారు. దేశ ప్రయోజనాల కోసమే పెద్ద నోట్లను రద్దు చేయాలని నిర్ణయించామని, ప్రజలు మరికొన్ని రోజుల పాటు కష్టపడ్డా, ఆపై ఎంతో సుఖపడతారని, దేశం వృద్ధి పథంలో దూసుకెళుతుందని అన్నారు. నోట్ల రద్దు కష్టాలను తీర్చేందుకు ఆర్బీఐ అనుక్షణం శ్రమిస్తోందని తెలిపారు. ప్రజల బాధలను తాను అర్థం చేసుకున్నానని, సాధ్యమైనంత త్వరలో సమస్యంతా సద్దుమణుగుతుందని, వ్యవస్థలోకి చాలినంత నగదును పంపే ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కేంద్రం, రాష్ట్రాలు, బ్యాంకు సిబ్బంది మరింత సమయం పాటు విధులు నిర్వహిస్తున్నారని కొనియాడారు. ప్రజలు తమ ప్రభుత్వాన్ని నమ్మారని, వారి విశ్వాసం చూస్తుంటే, తాను నల్లధనంపై విజయం సాధించినట్టే అనిపిస్తోందని అన్నారు.

  • Loading...

More Telugu News