: సోనాలి బింద్రే అందం నన్ను మైమరపిస్తుంది.. ఆమెతో డేటింగ్ అంటే ఇష్టం: సురేశ్ రైనా
టీమిండియా క్రికెటర్ సురేశ్‌రైనా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. టి20 క్రికెట్లో 6వేల పరుగులు చేసిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా, మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన తొలి భారతీయుడిగా, టీ20, వన్డే ప్రపంచకప్‌లలో సెంచరీలు చేసిన భారతీయుడిగా, 9 ఐపీఎల్ సీజన్లలో 4వేల పరుగులు చేసిన ఒకే ఒక్కడిగా.. ఇలా చెప్పుకుంటూపోతే బోల్డన్ని రికార్డులు అతడి సొంతం. నేడు సురేశ్ రైనా బర్త్ డే. 30వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని ముఖ్యమైన అంశాలు మీకోసం.. సురేశ్ రైనాకు తల్లి పర్వీన్, కుమార్తె గ్రేసియా అంటే ప్రాణం. 2015లో ఐటీ ఉద్యోగి ప్రియాంకను పెళ్లాడాడు. క్రికెట్ అంటే ప్రాణంపెట్టే రైనా కుటుంబానికీ అంతే ప్రాధాన్యం ఇస్తాడు. దైవభక్తి, దేశభక్తిలోనూ ముందుంటాడు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే సురేశ్.. సాయిబాబా ఫొటోలను ఎక్కువగా షేర్ చేస్తుంటాడు. ఓ టీవీషోలో మాట్లాడుతూ తనకు ఒకప్పటి బాలీవుడ్ స్టార్ సోనాలి బింద్రే అంటే చాలా ఇష్టమని పేర్కొన్నాడు. ఆ సొట్టబుగ్గల సుందరితో డేటింగ్ చేయడమంటే ఎంతో ఇష్టమని, ఆమె అందం తనను కట్టిపడేస్తుందని, మైమరపిస్తుందంటూ మనసులో మాట బయటపెట్టాడు. రైనాకు ఇష్టమైన సినిమాలు షోలే, చైనాగేట్, నోట్ బుక్ కాగా చైనీస్ మటన్, చికెన్ సీక్ కబాబ్ అంటే పడిచస్తాడు. ఇష్టమైన క్రికెటర్ సచిన్ టెండూల్కర్. శ్రీలంక బౌలింగ్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ అత్యంత కఠినమైన బౌలర్ అని రైనా అభిప్రాయం. 2005లో 19 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి తనదైన బ్యాటింగ్ శైలితో అభిమానులను తనవైపు తిప్పుకున్నాడు. కొన్ని మ్యాచ్‌లలో కెప్టెన్, వైస్ కెప్టెన్‌గానూ రైనా సేవలందించాడు.