: ఉక్కు మహిళ ఇందిరాగాంధీని ఇబ్బంది పెట్టి.. ఆనందంలో ముంచెత్తిన ఫిడేల్ క్యాస్ట్రో!


ఉక్కు మహిళ ఇందిరాగాంధీని ఒక్క క్షణంపాటు క్యూబా అధ్యక్షుడు ఫిడేల్ క్యాస్ట్రో ఇబ్బంది పెట్టారు. ఆ ఘటన పూర్వాపరాల్లోకి వెళ్తే... 1979లో క్యూబా రాజధాని హవానాలో అలీనోద్యమ సదస్సు (నామ్) జరిగింది. తరువాతి సదస్సు 1983లో ఢిల్లీ విజ్ఞానభవన్‌ లో జరిగింది. ఈ సమావేశంలో క్యూబా అధ్యక్షుడు కాస్ట్రో మాట్లాడుతూ సదస్సు అధ్యక్ష బాధ్యతలను తన సోదరి ఇందిరాగాంధీకి గర్వంగా అప్పగిస్తున్నానంటూ ప్రకటించి, సభా వేదికపై నిలబడ్డారు. దీంతో వేదికపై కూర్చున్న సుమారు వందకుపైగా దేశాధినేతలు హర్షద్వానాలు చేస్తుండగా, ఇందిరాగాంధీ తన సీట్లోంచి లేచి, క్యాస్ట్రో వద్దకు వచ్చారు. అనంతరం మర్యాదపూర్వకంగా చేయిని హ్యాండ్ షేక్ కోసం ముందుకు చాచారు. ఆజానుబాహుడైన క్యాస్ట్రో తన చేతిని ముందుకు చాచకుండా నవ్వుతూ నిల్చున్నారు. దీంతో కాస్త ఇబ్బంది పడ్డ ఇందిర మరోసారి చేతిని ముందుకు చాచారు. దానికి కూడా స్పందించని క్యాస్ట్రో నవ్వుతూ నిల్చున్నారు. దీంతో అంతా ఆశ్చర్యపోయారు. చూస్తే సిస్టర్ అన్నాడు, చేయిచాచితే స్పందించడం లేదు... అప్పటికే ధీరుడిగా పేరుతెచ్చుకున్న క్యాస్ట్రో తనను అవమానిస్తున్నాడా? లేక ఇంకేమైనా ఉందా? ఈ సారి చేయిచాచితే హ్యాండ్ షేక్ ఇస్తాడా? అన్న ఆలోచన మెదులుతుండగానే... క్యాస్ట్రో ముందుకు కదిలి ఉక్కుమహిళ ఇందిరా గాంధీని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. దీంతో ఆ ఆత్మీయతకు సదస్సు మొత్తం కదిలిపోయింది. అప్పట్లో అలీన దేశాల్లో ఆ ఫోటో మార్మోగిపోయింది. అన్ని పత్రికల్లోనూ ప్రధాన వార్తగా నిలిచింది. భారత్ పై క్యాస్ట్రోకు అంతులేని ఆపేక్ష అని ఆ నాటి ఘటనతో నిరూపితమైంది. అలాంటి బంధమే ఇప్పటికీ ఈ రెండు దేశాల మధ్య ఉంది. దీనికి మరో ప్రధాన కారణం, అప్పటి సోవియట్ యూనియన్ కు ఈ రెండు దేశాలు మిత్రదేశాలన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News