: ప్రజల బ్యాంకు అకౌంట్ల నుంచి డబ్బు మాయం చేస్తోన్న కేటుగాళ్లు
ప్రజలు ఆన్లైన్ లావాదేవీలకు అలవాటు పదాలని ఓ పక్క కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తోన్న సంగతి తెలిసిందే. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలు కూడా అధిక సంఖ్యలో ఆన్లైన్ లావాదేవీలు జరుపుకుంటున్నారు. అయితే, ఇదే అదునుగా చూసుకుంటున్న సైబర్ నేరగాళ్లు ఖాతాదారుల బ్యాంకు అకౌంట్లనుంచి నగదుని కొట్టేస్తున్నారు. తాజాగా కావలిలోని ఆంధ్రాబ్యాంకులో ఖాతా ఉన్న ఇద్దరు వ్యక్తుల నుంచి సైబర్ నేరగాళ్లు రూ.1.63 లక్షలను చోరీ చేశారు. ఈ విషయంపై సదరు వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాళ్లోకి వెళితే, ఆ ప్రాంతంలోని పాతూరుకు చెందిన సీహెచ్.సుమాన్ అనే వ్యక్తి పెద్దనోట్ల రద్దు తరువాత తన ఖాతాలో రూ.1.07 లక్షలు డిపాజిట్ చేశారు. అంతకు ముందు కూడా ఆయన అకౌంట్లో రూ.47 వేలు ఉన్నాయి. అయితే, మరుసటి రోజు ఆయన బ్యాంకుకు వచ్చి కొంత డబ్బును తీసుకోవాలని చూస్తే బ్యాంకు సిబ్బంది ఆయన ఖాతాలో డబ్బు లేదని షాకింగ్ న్యూస్ చెప్పారు. మరోవైపు బుడంగుంట ప్రాంతానికి చెందిన ఉషారాణి అనే మహిళ కూడా ఈ నెల 11న అదే బ్యాంకులో రూ.9 వేలు జమ చేసుకున్నారు. వారం రోజుల అనంతరం కొంత డబ్బు తీసుకుందామని బ్యాంకుకు వెళ్లగా ఆమె ఖాతాలో డబ్బులు లేవని సిబ్బంది చెప్పారు. ఇరువురు ఖాతాదారులు బ్యాంకు మేనేజర్‌ను సంప్రదించగా వెంటనే వారి ఏటీఎం కార్డులను బ్లాక్ చేయించి, అసలు విషయంపై ఆరా తీశారు. వీరిద్దరి ఖాతాల్లోని నగదు ఈ నెల 11న ఆన్లైన్ ద్వారా మరో ఖాతాలోకి బదిలీ అయినట్లు గుర్తించారు. తాజాగా వారిరువురూ ఈ విషయంపై పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఖాతాదారులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని తమ ఏటీఎం వివరాలను ఇతరులకు ఇవ్వకూడదని, వాటి పిన్ నెంబర్లతో పాటు సీవీవీ, ఎక్స్ పైరీ డేట్ లాంటి వివరాలు చెప్పకూడదని బ్యాంకు అధికారులు సూచిస్తున్నారు. బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని ఎవరయినా చెప్పి తమ అకౌంట్ వివరాలు అడిగితే చెప్పకూడదని అన్నారు.