: భారీగా భూములు కొనుగోలు చేశారు.. ‘పెద్దనోట్ల రద్దు’ బీజేపీ నేతలకు ముందే తెలుసు: జేడీయూ
పెద్దనోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రకటించకముందే ఆ విషయం బీజేపీ శ్రేణులకి తెలుసని బీహార్ జేడీయూ నేతలు ఆరోపిస్తున్నారు. జేడీయూ నేత నీరజ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ... పెద్దనోట్ల రద్దు గురించి తెలిసింది కాబట్టే బీజేపీ నేతలు బీహార్ వ్యాప్తంగా బీజేపీ ఆఫీసుల పేరుతో భారీగా భూములు కొనుగోలు చేశారని అన్నారు. బీజేపీ నాయకులు తమ వద్ద ఉన్న బ్లాక్‌మనీతో ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో తమ రాష్ట్రంలో తక్కువ ధరలకే భూములను కొనుక్కున్నారని, మొత్తం 23 ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేశారని ఆరోపణలు గుప్పించారు. తాము చెబుతున్న అంశాలపై విచారణ జరిపించాలని అన్నారు. జేడీయూ చేస్తోన్న ఆరోపణల పట్ల స్పందించిన బీజేపీ నేతలు తాము చేసిన భూమి కొనుగోలు సమయంలో అందుకు సంబంధించిన డబ్బుని చెక్కుల ద్వారానే చెల్లించుకున్నామని చెప్పారు. తమ అధినేత అమిత్‌షా బీహార్‌తో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీజేపీ కార్యాలయాలు నెలకొల్పేందుకు భూములు కొనుగోలు చెయ్యాలని చెప్పారని, అందుకే భూములను కొనుగోలు చేశామని బిహార్ బీజేపీ అధ్యక్షుడు మంగళ్ పాండే పేర్కొన్నారు. మరో సీనియర్ నేత సుశీల్ మోదీ బీజేపీపై వస్తోన్న ఆరోపణలపై స్పందిస్తూ.. రాహుల్ గాంధీ ఇటీవల బీజేపీపై విమర్శలు గుప్పిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి అరణ్జైట్లీకే పెద్దనోట్ల రద్దు అంశం గురించి ముందుగా తెలియదని అన్నారని, అటువంటప్పుడు ఇతర బీజేపీ నేతలకు, కార్యకర్తల ఎలా తెలుస్తుందని దుయ్యబట్టారు.