: ‘అమెరికా దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్న ధీశాలి ఆయన’.. క్యాస్ట్రోకు వామపక్ష నేతల నివాళులు
అనారోగ్యంతో బాధపడుతూ క్యూబా మాజీ అధ్యక్షుడు, విప్లవ నేత ఫిడెల్ క్యాస్ట్రో (90) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల సీపీఎం నేతలు తమ్మినేని, మధు, రాఘవులు, సీపీఐ నేతలు సురవరం, నారాయణ, రామకృష్ణ సంతాపం తెలిపారు. క్యాస్ట్రో మరణం తీరని లోటని మధు అన్నారు. ప్రజాసమస్యలపై నాయకులు చేసే అలుపెరుగని నిరంతర పోరాటాలే క్యాస్ట్రోకు ఘనమైన నివాళి అని ఆయన వ్యాఖ్యానించారు. తమ్మినేని వీరభద్రం స్పందిస్తూ.. ఆయన మృతి క్యూబా ప్రజలకే కాకుండా సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలకు కూడా తీరనిలోటని వ్యాఖ్యానించారు. అలుపెరగని పోరాటం చేసిన క్యాస్ట్రో అగ్రరాజ్యం అమెరికా సామ్రాజ్యవాద దాడులను 50 ఏళ్ల పాటు సమర్థవంతంగా ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. ఎన్నో దేశాల్లో విప్లవపోరాటాలకు ఆయన ఆదర్శంగా నిలిచారని చెప్పారు.