: హైదరాబాద్‌లో నకిలీ నోట్ల కలకలం... బంగ్లాదేశ్, మాల్దా నుంచి నకిలీ నోట్లు
హైదరాబాద్‌లో నకిలీ నోట్ల కలకలం చెలరేగుతోంది. బంగ్లాదేశ్, మాల్దా నుంచి నకిలీ నోట్లు వస్తున్నాయని రాచకొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ చెప్పారు. ఈ చర్యలకు పాల్పడుతున్న 8 మంది సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ముఠాపై నిఘా ఉంచిన పోలీసులు ఎంతో చాకచక్యంగా పట్టుకున్నట్లు తెలిపారు. వీరు దొంగనోట్లను చలామణీ చేస్తున్నారని చెప్పారు. వారిపేర్లు సాయినాథ్, అంజయ్య, రమేష్, సత్యనారాయణ, శ్రీధర్‌గౌడ్, విజయ్‌కుమార్, కల్యాణ్, శ్రీకాంత్‌లుగా చెప్పారు. నిజమైన నోటుకి, నకిలీ నోట్లకు ఎంతో తేడా ఉంటుందని భగవత్ చెప్పారు. ప్రస్తుతం ప్రజల్లో కొత్త 2000 రూపాయల నోటు గురించి అవగాహన లేదని చెప్పారు. ఒరిజినల్ నోట్ ఏదో, ఫేక్ నోట్ ఏదో ప్రజలకు తెలియని పరిస్థితి ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ప్రజలు అధికంగా మోసపోతున్నారని చెప్పారు. 2000 రూపాయలు పెద్ద నోటు కాబట్టి పేదల చేతికి ఆ నకిలీ నోటు వస్తే ఎన్నో ఇబ్బందులు పడతారని చెప్పారు. ఒరిజినల్, ఫేక్ నోట్లపై ఈ సందర్భంగా పోలీసులు డెమో ఇచ్చారు. కొత్త వంద రూపాయల నోట్లతో పాటు, 2000 రూపాయల ఫీచర్ల గురించి వివరించి చెప్పారు. ప్రజలు కొత్తనోట్లను గుర్తించే అంశంపై అవగాహన పెంచుకోవాలని భగవత్ చెప్పారు. తాము అరెస్టు చేసిన నిందితులపై గతంలోనూ పలు కేసులు ఉన్నాయని చెప్పారు. వారి వద్ద నుంచి నకిలీ నోట్ల తయారికి ఉపయోగించే పలు లిక్విడ్లతో పాటు పలు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నోటుపై ఉన్న గాంధీ బొమ్మ వాటర్ మార్కును కూడా వారు ముద్రించారని, ముద్రణకు మంచి క్వాలిటీ పేపర్‌ను సైతం ఉపయోగించారని చెప్పారు.