: మోదీ నిర్ణయంపై ప్రశంసల జల్లు కురిపించిన చైనా మీడియా.. తమ దేశం కూడా పరిశీలిస్తోందని కథనం


చైనా మీడియా ఈ సారి విభిన్నంగా స్పందించింది. ఇటీవ‌ల ఎన్నో సంద‌ర్భాల్లో ఇండియాపై ప‌లు అభ్యంత‌ర‌క‌ర క‌థ‌నాలు రాస్తూ, భార‌తీయుల ఆగ్ర‌హానికి గుర‌యిన చైనా మీడియా తాజాగా ఆస‌క్తిక‌ర క‌థానాన్ని ప్ర‌చురించింది. న‌ల్ల‌ధ‌నం, న‌కిలీ నోట్ల‌ను అరిక‌ట్ట‌డానికి ఈ నెల 8న భార‌త ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ చేసిన పెద్ద‌నోట్ల ర‌ద్దు ప్ర‌క‌ట‌న ఎంతో ధైర్య‌వంతంగా తీసుకున్న నిర్ణ‌య‌మ‌ని పేర్కొంది. భార‌త్ తీసుకున్న ఈ నిర్ణ‌యం మోదీ ల‌క్ష్యం సాధ‌న‌లో విఫ‌ల‌మైనా, విజ‌యం సాధించినా దాన్నుంచి త‌మ దేశం పాఠాలు నేర్చుకుంటుందని చెప్పింది. చైనాని కూడా న‌ల్ల‌ధనం ప‌ట్టిపీడిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అవినీతిని అరిక‌ట్ట‌డానికి నోట్లరద్దు అంశం పాత్ర ఎలా ఉంటుందన్న విష‌యాన్ని తాము స‌మ‌గ్రంగా పరిశీలిస్తున్న‌ట్లు పేర్కొంది. త‌మ దేశంలోనూ పెద్ద‌నోట్ల‌యిన‌ 50 యువాన్లు, 100 యువాన్ల నోట్లను రద్దుచేస్తే జ‌రిగే ప‌రిణామాల గురించి ముందుగా అంచ‌నా వేయ‌లేమ‌ని చెప్పింది. ఇటువంటి నిర్ణ‌యాలు తీసుకునేట‌ప్పుడు ముందుగా లీక్ చేస్తే ఎంతో దారుణ ప‌రిస్థితులు ఎదుర‌వుతాయ‌ని, కాబ‌ట్టి ఇటువంటి అంశాన్ని అత్యంత రహస్యంగా ఉంచాల్సిందేనని అభిప్రాయ‌ప‌డింది. ఇటువంటి ఒక కొత్త నిర్ణ‌యం తీసుకునే ముందు ప్ర‌జల మద్దతు ముందుగానే కూడ‌గ‌ట్టాల‌న్న అంశం ఇక్కడ వర్తించబోదని పేర్కొంది. అవినీతి నిరోధానికి ఇలాంటి సంచ‌ల‌న సంస్క‌ర‌ణ‌లు అవ‌స‌ర‌మ‌ని చెప్పింది. అయితే, ఇండియాలో 90 శాతానికి పైగా లావాదేవీలు డ‌బ్బు రూపంలోనే ఉంటాయ‌ని, ఇటువంటి నేప‌థ్యంలో దేశంలోని 85 శాతం కరెన్సీని రద్దు చేయడం వల్ల ప్ర‌జ‌లు ఇబ్బందులు ఎందుర్కుంటార‌ని చెప్పింది. భార‌త‌ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ అంశంలో చెప్పిన ప‌లు అంశాల‌ను కూడా చైనా మీడియా గుర్తుచేసింది. ఇటువంటి నిర్ణ‌యం వల్ల అవినీతి, చీక‌టి ఆర్థికవ్యవస్థలను నిర్మూలించ‌వ‌చ్చిని చెప్పింది. అయితే, సామాజిక‌, రాజకీయ సమస్యలను ఈ నిర్ణ‌యం తీర్చ‌లేద‌ని అభిప్రాయ‌ప‌డింది. దేశంలో ఉన్న అవినీతికి మూలకారణాలను ప‌రిశీలించి వాట‌న్నింటినీ పూర్తిగా రూపుమాపే వ‌రకు అవినీతి సమస్య తిరిగి వస్తూనే ఉంటుందని చైనా మీడియా పేర్కొంది. భార‌త ప్ర‌ధాని మోదీ తీసుకున్న ఈ నిర్ణ‌యం తన సర్కారుతో పాటు దేశంలోని ప్ర‌జ‌ల‌ సహన స్థాయి మీద గాంబ్లింగ్ ఆడిన‌ట్లు ఉంద‌ని చెప్పింది.

  • Loading...

More Telugu News