: కుప్పకూలిన టాప్ ఆర్డర్... కష్టాల్లో పడ్డ ఇంగ్లండ్


భారత్ తో మొహాలీలో జరుగుతున్న మూడో టెస్ట్ లో ఇంగ్లండ్ తడబడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ వంద పరుగులు కూడా చేయకుండానే నాలుగు వికెట్లు కోల్పోయింది. జట్టు స్కోరు 31 వద్ద ఉన్నప్పుడు 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హమీద్ ఔట్ అయ్యాడు. ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో రహానేకు క్యాచ్ ఇచ్చి హమీద్ వెనుదిరిగాడు. అనంతరం, 51 పరుగుల వద్ద ఇంగ్లీష్ జట్టు రెండు కీలక వికెట్లను కోల్పోయింది. నిలకడగా ఆడుతున్న కెప్టెన్ కుక్ 27 పరుగులు చేసి ఔట్ కాగా... కీలక బ్యాట్స్ మెన్ రూట్ 15 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. కుక్ ను అశ్విన్ ఔట్ చేయగా... జయంత్ బౌలింగ్ లో రూట్ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఆ తర్వాత మొహమ్మద్ అలీ, బెయిర్ స్టోలు వికెట్ పడకుండా కొంచెం జాగ్రత్త పడ్డారు. చివరకు 87 పరుగుల వద్ద ఇంగ్లండ్ జట్టు మొయిన్ వికెట్ ను కోల్పోయింది. మొహమ్మద్ షమీ బౌలింగ్ లో మురళికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు మొయిన్. ప్రస్తుతం బెయిర్ స్టో (20), స్టోక్స్ (5) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ ప్రస్తుత స్కోరు నాలుగు వికెట్ల నష్టానికి 92 పరుగులు.

  • Loading...

More Telugu News