: ప్రజలకు మరో తలనొప్పి.. నేడు, రేపు బ్యాంకులకు సెలవ్.. సోమవారం బంద్‌లో పాల్గొంటే ఆరోజూ అంతే!
నోట్ల రద్దుతో కష్టాల్లో కూరుకుపోయిన ప్రజలకు మరో తలనొప్పి వచ్చి పడింది. పెద్ద నోట్లు రద్దు చేసి మూడు వారాలు గడుస్తున్నా ప్రజల కష్టాలు కడతేరకపోగా మరింత ఎక్కువ అవుతున్నాయి. బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూలు పెరుగుతూనే ఉన్నాయి. అయితే గతంతో పోలిస్తే పరిస్థితి కొంత మెరుగుపడిందనే చెప్పాలి. కొత్త రూ.500 నోట్లు బ్యాంకులకు చేరడంతో కాస్త ఊరట కనిపించింది. అయితే ప్రజలకు ఈ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. వరుసగా రెండు రోజులు బ్యాంకులకు సెలవులు రావడంతో వారిలో నిరాశ ఆవరించింది. 26వ తేదీ నాలుగో శనివారం, 27 ఆదివారం కావడంతో రెండు రోజులు బ్యాంకులకు తాళాలు తప్పని పరిస్థితి. 28న నోట్ల రద్దుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఇచ్చిన బంద్‌లో బ్యాంకులు కూడా పాల్గొంటే వరుసగా మూడు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. అదే కనుక జరిగితే నోట్ల రద్దు మరుసటి రోజు నాటి పరిస్థితి మళ్లీ తలెత్తే ప్రమాదం ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. బ్యాంకులు తెరుచుకోక, ఏటీఎంలలో డబ్బులు లేక ప్రజలు అష్టకష్టాలు పడే అవకాశం ఉందని చెబుతున్నారు. కాబట్టి శని, ఆదివారాల్లో సరిపడా నగదును ఏటీఎంలలో సర్దితే ప్రజల కష్టాలు కొంతవరకైనా తీరే అవకాశం ఉంటుందని అంటున్నారు. ప్రభుత్వం, బ్యాంకు అధికారులు ఈ విషయంలో చొరవ తీసుకుని ముందుగానే ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.