: పొరపాటు నిజమే.. ఆందోళన వద్దు.. అన్ని నోట్లు చెల్లుబాటు అవుతాయి: ఆర్బీఐ వివరణ
కొత్త రూ.500 నోట్లలో ముద్రణ లోపాలపై రిజర్వు బ్యాంకు స్పందించింది. నోట్లను అత్యవసరంగా ప్రింట్ చేయాల్సి రావడంతో కొన్ని లోపాలు ఏర్పడ్డాయని, అయితే ప్రజలు అయోమయం చెందాల్సిన అవసరం లేదని, అన్ని నోట్లు చెల్లుతాయని పేర్కొంది. ఒకే డినామినేషన్‌లో నోట్లు రెండు రకాలుగా ప్రింట్ అయ్యాయని, అయితే రెండు నోట్లూ చెల్లుతాయని, ఆందోళన వద్దని సూచించింది. తాజాగా ఆర్బీఐ విడుదల చేసిన రూ.500 నోట్లలో ముద్రణ లోపాలు బయటపడడంతో అవి చెల్లుబాటు కావంటూ వదంతులు వ్యాపించిన నేపథ్యంలో ఆర్బీఐ స్పందించి ఈ వివరణ ఇచ్చింది. కొత్త రూ.500 నోట్లలో కొన్నింటిలో గాంధీ బొమ్మ నీడలు కనిపించగా, మరికొన్నింటిలో జాతీయ చిహ్నం, సీరియల్ నంబరు ఉండాల్సిన చోట్లలో తేడాలు ఉన్నాయి. ఇక ముందు విడుదల చేసే నోట్లలో ఈ లోపాలను సవరించుకుంటామని ఆర్బీఐ పేర్కొంది.