: జన్ధన్ ఖాతాల్లోకి భారీగా డబ్బు.. లోక్ సభలో వివరాలు వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జన్ ధన్ యోజన ఖాతాల్లో పెద్దనోట్ల రద్దు అనంతరం భారీ మొత్తంలో నగదు వచ్చి పడింది. ఇన్ని రోజులూ జీరో బ్యాలెన్స్‌గా ఉన్న ఖాతాల్లో ఒక్కసారిగా డబ్బు జమ అయింది. జన్ ధన్ ఖాతాలు అన్నింటిలో కలిపి 21 వేల కోట్ల రూపాయల డిపాజిట్లు అయినట్లు ఇటీవలే అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటివరకు జన్ధన్ ఖాతాల్లోకి రూ.64,250 కోట్లు డిపాజిట్ అయ్యాయి. అందులో యూపీలో గరిష్ఠంగా రూ.10,670.62 కోట్లు కాగా, ఆ తరువాతి స్థానంలో పశ్చిమబెంగాల్ ఉన్నట్టు కేంద్ర సర్కారు పేర్కొంది. దేశ వ్యాప్తంగా ఉన్న 25.58 కోట్ల జన్ధన్ ఖాతాల్లో ఈ నెల 16 వరకు అగ్రిగేట్గా రూ.64,252.15 కోట్లు జమ అయినట్లు ఆర్థికశాఖ సహాయమంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ పేర్కొన్నారు. వివిధ వర్గాల ప్రజలకు చెందిన జన్‌ధన్ ఖాతాల్లో నల్లకుబేరులు భారీగా డిపాజిట్ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. అటువంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.