: నకిలీ నోట్లు ముద్రిస్తున్న భారత సంతతి వ్యక్తిని అరెస్టు చేసిన సింగపూర్ పోలీసులు
తమ దేశంలో నకీలీ కరెన్సీ నోట్లను ముద్రిస్తోన్న భారత సంతతికి చెందిన ఓ వ్యక్తిని సింగపూర్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శశికుమార్ లక్ష్మణ్ అనే వ్యక్తి మొదట 100 డాలర్ల నోటును జిరాక్స్ తీసి పరిశీలించాడు. తాను జిరాక్స్ తీసిన నోటు అసలైన నోటును పోలి ఉండడాన్ని గమనించి, ఈ తరువాత పలు ప్రయోగాలు చేసి మూడు నకిలీ నోట్లను ముద్రించాడు. వాటితో మార్కెట్లోకి వెళ్లి ఒక వంద డాలర్ల నోటుతో ఓ సిగరెట్ ప్యాకెట్‌ను కొనుక్కున్నాడు. ఎవ్వరూ గుర్తు పట్టకపోవడంతో మరిన్ని ముద్రించాలని నిర్ణయం తీసుకొని నకిలీ నోట్ల ప్రింటింగ్ ప్రారంభించాడు. విషయాన్ని గమనించిన ఓ స్టాల్ యజమాని ఈ ఏడాది జూలైలో అక్కడి పోలీసులకు సమాచారం అందించాడు. అతడి ఇంటిపై దాడి చేసిన పోలీసులు నకిలీ 500 డాలర్ల నోటును స్వాధీనం చేసుకుని, కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. న్యాయస్థానంలో లక్ష్మణ్ దోషిగా తేలితే సుమారు 20 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది.