: ఐటీ అధికారులు దాడులు చేయ‌లేదు: నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌ వివరణ


ఇటీవ‌ల అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన‌ కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి కూతురి వివాహ వేడుక‌లో టాలీవుడ్‌ నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌ డ్యాన్స్ చేసి అల‌రించిన సంగ‌తి తెలిసిందే. పెళ్లి ఖ‌ర్చుల‌పై ఆదాయ పన్ను శాఖ నిర్వ‌హించిన‌ దాడుల నేప‌థ్యంలో రకుల్‌ప్రీత్‌ సింగ్ ఇంటిపై కూడా దాడులు నిర్వ‌హించార‌ని ప‌లు వార్త‌లు వ‌చ్చాయి. వీటిపై ఆమె స్పందిస్తూ వాటిల్లో నిజంలేదని మండిప‌డింది. ప్ర‌జ‌లు ఈ విషయంపై ఎందుకింత చ‌ర్చించుకుంటున్నారో త‌నకు తెలియడం లేదని ఆమె వాపోయింది. తాను పెళ్లి వేడుక‌లో డ్యాన్స్ చేసేందుకు ఒకటికి మూడింతలు పారితోషికం తీసుకున్నాన‌ని జ‌నాలు ప్ర‌చారం చేశార‌ని, ఇప్పుడేమో ఆదాయ‌ప‌న్ను శాఖ‌ దాడి చేసింద‌ని చెప్పుకుంటున్నార‌ని రకుల్‌ప్రీత్‌ సింగ్‌ పేర్కొంది. ఇటువంటి ప్ర‌చారాలు రావ‌డం త‌న‌కు చాలా కోపాన్ని తెప్పిస్తోందని చెప్పింది. ఇటువంటి వ‌దంతుల‌తో త‌న‌ నాన్న ఎంతో బాధపడుతున్నారని వ్యాఖ్యానించింది. నిజానిజాలను తెలుసుకోకుండా కనీసం త‌న‌ను ఈ విష‌యాల‌పై అడగకుండానే ప్ర‌చారం చేస్తున్నార‌ని చెప్పింది. తాను మీడియా ముందు చాలా ఓపెన్‌గా ఉంటానని, త‌న లైఫ్‌కి సంబంధించినంత‌వ‌ర‌కు అన్ని అంశాల‌ను ప్రేక్ష‌కుల‌తో చెప్పేస్తాన‌ని తెలిపింది.

  • Loading...

More Telugu News