: పంజాబ్‌కు రాకుండా నన్ను భయపెట్టాలని చూస్తున్నారు: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆగ్రహం
వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాజాగా నిహల్‌సింగ్ వాలా ప్రాంతంలో ర్యాలీ నిర్వహించి, ప్రసంగించారు. తనను పంజాబ్‌కు రాకుండా భయపెట్టాలని పలువురు చూస్తున్నారని వారివి విఫల ప్రయత్నాలేనని అన్నారు. ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం తాను జరుపుతున్న ప్రయత్నాలను ఎవరూ ఆపలేరని అన్నారు. అదే సమయంలో ర్యాలీలోకి దూసుకొచ్చిన అకాళీదళ్‌కు చెందిన 20 మంది ఆందోళనకారులు కేజ్రీవాల్ ఉన్న వాహనంపై కర్రలతో దాడికి దిగారు. తనపై జరిగిన ఈ దాడికి ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్దే బాధ్యత అది కేజ్రీవాల్ అన్నారు. తన వాహనంపై ఉద్దేశపూర్వకంగానే దాడికి దిగారని, ఆ రాష్ట్ర పోలీసులు సైగ చేసిన అనంతరమే తనపైకి ఆందోళనకారులు దూసుకొచ్చారని కేజ్రీవాల్ అన్నారు. బాదల్ కారుపై రాష్ట్రంలో ఎవరయినా ఇటువంటి దాడి చేయగలరా? అని ఆయన ప్రశ్నించారు. తాను ఆ రాష్ట్రానికి రాకూడదని బాదల్ తనను భయపెట్టాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆ రాష్ట్రానికి మంచి జరగడం కోసం తాను ప్రాణాలు కోల్పోవడానికి కూడా సిద్ధమేనని వ్యాఖ్యానించారు. తన జీవితాంతం ప్రజల కోసం పోరాడతానని చెప్పారు.