: అబ్బాయిలతో చెట్టపట్టాలేసుకుని తిరిగే అమ్మాయిలకు ఎన్ఐటీ వార్నింగ్.. క్యాంపస్ లో కలకలం!


హాస్టల్ లో ఉంటూ అబ్బాయిలతో కలసి తిరుగుతూ కనిపిస్తే, హాస్టల్ నుంచి బహిష్కరిస్తామని కాలికట్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) వార్నింగ్ ఇవ్వడం కలకలం రేపుతోంది. రెసిడెన్షియల్ క్యాంపస్ లో అబ్బాయిలతో కలసి అమ్మాయిలు కనిపిస్తే చూస్తూ ఊరుకోబోమని హాస్టల్ వార్డెన్ ఎస్ భువనేశ్వరి సంతకంతో నోటీసు బోర్డులో నోటీసులు కనిపించగా, వీటిపై విద్యార్థులు తీవ్ర నిరసన తెలుపుతున్నారు. ప్రధాన క్యాంపస్ కు ఎదురుగా రెండు రెసిడెన్షియల్ క్యాంపస్ లు ఉండగా, వీటిల్లో విద్యార్థినులకు ఆతిథ్యం కల్పిస్తున్నారు. ఆ పక్కనే ఫ్యాకల్టీలకు రెసిడెన్షియల్ క్వార్టర్స్ ఉంటాయి. ఇక కేవలం అమ్మాయిలకు మాత్రమే నోటీసులు జారీ చేయడాన్ని తప్పుబడుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఎన్ఐటీ పూర్వ విద్యార్థులు సైతం ఇది లింగ వివక్షేనని, మోరల్ పోలీసింగ్ ను విద్యార్థినులపై మాత్రమే రుద్దుతున్నారని విమర్శించారు. కేవలం అబ్బాయిలతో కనిపించే అమ్మాయిలనే హాస్టళ్ల నుంచి పంపేస్తామని చెప్పడం వివక్షేనని అంటున్నారు. ఇక భువనేశ్వరి నోటీసులను కొందరు ఫ్యాకల్టీలు సైతం తప్పుబడుతున్నారు. సమాజంలో వస్తున్న మార్పులను కొందరు ఎన్నటికీ అంగీకరించే స్థితిలో లేరని ఎలక్ట్రికల్ ఇంజనీంగ్ విభాగం ప్రొఫెసర్ పౌల్ జోసఫ్ వ్యాఖ్యానించారు. కలిసి నడిచినంత మాత్రాన చదువుకునే వారిని సస్పెండ్ చేసి ఇంటికి పంపేస్తారా? అని ప్రశ్నించారు. ఈ నోటీసులు తమకు షాక్ కలిగించాయని విద్యార్థినుల ప్రతినిధి నిమిషా రాయ్ వ్యాఖ్యానించగా, వీటిని వెనక్కు తీసుకోవాలని విద్యార్థుల సంక్షేమ సంఘం ప్రతినిధి జీ ఉన్నికృష్ణన్ డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News