: రేపు హైదరాబాద్ రానున్న ప్రధాని.. అంతర్గత భద్రతపై ప్రసంగం
ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు హైదరాబాద్ రానున్నారు. దేశ అంతర్గత భద్రత అంశంపై సర్దార్ వల్లబాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో జరగనున్న రాష్ట్రాల డీజీపీ, ఐజీలో సదస్సులో మోదీ పాల్గొంటారు. ప్రధానితోపాటు కేంద్ర హోంమత్రి రాజ్‌నాథ్‌సింగ్, సహాయ మంత్రులు కిరణ్ రిజిజు, హసన్రాజ్ అహిర్ గంగారం, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, రా, ఐబీ సంస్థల చీఫ్‌లు కూడా ప్రధానితో కలిసి ప్రత్యేక విమానంలో రేపు హైదరాబాద్ చేరుకోనున్నారు. గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, పలువురు రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలకనున్నారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్న మోదీ శనివారం డీజీపీ, ఐజీపీల సదస్సులో ప్రారంభోపన్యాసం చేస్తారు. అదే రోజు సాయంత్రం 5.35 గంటలకు తిరిగి ఢిల్లీ బయలుదేరుతారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి పోలీసు అకాడమీకి, అక్కడి నుంచి తిరిగి శంషాబాద్ వరకు మాత్రమే ప్రధాని పర్యటన కొనసాగనుంది. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని సీఎస్ రాజీవ్‌శర్మ అధికారులను ఆదేశించారు.