: నియోజకవర్గాల పెంపు లేదు... తెలుగు రాష్ట్రాల ఆశలపై నీళ్లు చల్లిన కేంద్రం
ఉమ్మడి రాష్ట్రం రెండు ముక్కలైన తర్వాత నియోజకవర్గాల పెంపుపై రెండు తెలుగు రాష్ట్రాలు ఆశలు పెట్టుకున్నాయి. అయితే, ఈ ఆశలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది. రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపు ఉండబోదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్సరాజ్ స్పష్టం చేశారు. టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ ఈ రోజు రాజ్యసభలో నియోజకవర్గాల పెంపుపై అడిగిన ప్రశ్నకు బదులుగా హన్సరాజ్ ఈ సమాధానం ఇచ్చారు. నియోజకవర్గాలను పెంచాలంటే ఆర్టికల్ 371ను సవరించాలని... ఇప్పటికిప్పుడు అది సాధ్యమయ్యే పని కాదని కేంద్ర మంత్రి తేల్చి చెప్పారు. ఏపీ విభజన చట్టంలో నియోజకవర్గాల పెంపు విషయం స్పష్టంగా ఉంది. ఏపీలోని అసెంబ్లీ నియోజకవర్గాలను 175 నుంచి 225కి, తెలంగాణలో 119 నుంచి 175కి పెంచుకునే వెసులుబాటును విభజన చట్టంలో కల్పించారు. దీంతో, తమ రాష్ట్రంలో నియోజకవర్గాలను పెంచాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాయి. వాస్తవానికి డీమిలిటేషన్ ను 2026 వరకు చేపట్టకూడదంటూ గతంలో పార్లమెంటులో చట్టాన్ని చేశారు. దీంతో, రాజ్యాంగ పరంగా ఇబ్బందులు తలెత్తకుండా నియోజకర్గాల పెంపు సాధ్యమా? అంటూ అటార్నీ జనరల్ ను కేంద్రం అడిగింది. ఈ క్రమంలో, నిబంధనలు అంగీకరించవని అటార్నీ జనరల్ నివేదిక ఇచ్చింది. దీంతో, రెండు రాష్ట్రాల ఆశలపై నీరు చల్లినట్టైంది.