: యూపీలో కొత్తరకం పోస్టర్లు.. అప్పట్లో సర్జికల్ స్ట్రయిక్స్‌పై.. ఇప్పుడు పెద్దనోట్ల రద్దుపై!
ఇటీవల భారత సైన్యం పీవోకేలోకి ప్రవేశించి ఉగ్రవాద స్థావరాలపై జరిపిన లక్షిత దాడుల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో అందుకు సంబంధించి వెలసిన పోస్టర్లు కలకలం రేపిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఆరంభంలో ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో లక్షిత దాడులను బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటుందని విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. ప్రస్తుతం అదే రాష్ట్రంలో పెద్దనోట్ల రద్దు అంశంపై పోస్టర్లు వెలిశాయి. ఇందులో ప్రధాని మోదీ ఫొటోతో పాటు బీజేపీ పార్టీ చిహ్నాలు ఉన్నాయి. నల్లధనంపై మోదీ యుద్ధం చేశారని బరబంకి జిల్లాలో ఈ పోస్టర్లు కనిపిస్తున్నాయి. పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై ప్రజల నుంచి సానుకూలంగానే స్పందన వస్తుందని బీజేపీ అగ్రనేతలు ఇప్పటికే ఎన్నో సభల్లో చెప్పారు. నోట్ల రద్దు నిర్ణయం బాగుందని, అయితే అందులో కాస్త మార్పు చేసి ఉండాల్సిందని బీజేపీ కార్యకర్త అవిదేశ్ శ్రీవాస్తవ మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. బీజేపీ తీసుకున్న నిర్ణయం రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా కాదని చెప్పారు. ఇదే అంశంపై పోస్టర్లు వెలిసిన బరబంకి జిల్లాకు చెందిన 22 ఏళ్ల యువ రైతు సునీల్ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రబీ సీజన్‌పై అధికంగా పడిందని తన అభిప్రాయాన్ని తెలిపారు. తమకు విత్తనాలు కొనుగోలు చేసేందుకు రద్దయిన నోట్లను తీసుకునేందుకు అనుమతించాలని అన్నారు.