: నోట్ల రద్దుతో రూ. 55 వేల కోట్లు నష్టపోయిన టాటా, బిర్లాలు... అంబానీలు మాత్రం సేఫ్!
నవంబర్ 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన తరువాత బెంచ్ మార్క్ సూచిక సెన్సెక్స్ 7 శాతం దిగజారింది. ఈ పతనం ఇండియాలోని బిలియనీర్ సంస్థలను నిర్వహిస్తున్న టాటాలు, బిర్లాలు, మహీంద్రాల ఆస్తులను కుదించి వేసింది. ఈ గ్రూపుల్లోని ఒక్కో కంపెనీ మార్కెట్ కాప్ ను దాదాపు బిలియన్ డాలర్ వంతున నష్టపరిచింది. ఈ 8 రోజుల సెషన్లలో టాటా గ్రూప్ కంపెనీలతో పాటు, ఏబీ బిర్లా, మహీంద్రా గ్రూప్ కంపెనీలు 9 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 55 వేల కోట్లకు పైగా) నష్టపోయాయి. వీటితో పాటు పలు పెద్ద కంపెనీలూ నష్టపోగా, ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ పై మాత్రం పెద్దగా ప్రభావం పడలేదు. టాటా గ్రూప్ లోని 27 కంపెనీల ప్రమోటర్ల సంపద నవంబర్ 8 నుంచి 21 మధ్య రూ. 39,636 కోట్లు తగ్గగా, ఒక్క టీసీఎస్ వల్లనే రూ. 21,839 కోట్ల నష్టం వాటిల్లింది. గ్రూప్ లోని టాటా మోటార్స్ రూ. 8,954 కోట్లు, టైటాన్ రూ. 3,131 కోట్లు, టాటా స్టీల్ రూ. 1,128 కోట్లు నష్టపోయాయి. ఈ కంపెనీలపై మిస్త్రీ తొలగింపు ప్రభావం కూడా ఉన్నట్టు మార్కెట్ పండితులు వ్యాఖ్యానించారు. ఇక బిర్లా గ్రూప్ విషయానికి వస్తే, ప్రమోటర్లకు రూ. 15,819 కోట్ల నష్టం రాగా, అత్యధిక డ్యామేజ్ అల్ట్రా టెక్ సిమెంట్స్ నుంచి కలిగింది. అల్ట్రా టెక్ సిమెంట్స్ సంస్థ ఏకంగా రూ. 10,678 కోట్లు నష్టపోయింది. మిగతా పెద్ద గ్రూప్ సంస్థల్లో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ రూ. 1,520 కోట్లు, హిందాల్కో ఇండస్ట్రీస్ రూ. 794 కోట్లు, మహింద్రా గ్రూప్ సంస్థలు రూ. 6,100 కోట్లు నష్టపోయాయి. ఇక ముఖేష్ అంబానీ విషయానికి వస్తే, మార్కెట్ 7 శాతానికి పైగా పడిపోయినప్పటికీ, రిలయన్స్ కు కలిగిన నష్టం 1.78 శాతమే. రిలయన్స్ మార్కెట్ కాప్ కేవలం రూ. 2,760 కోట్లు మాత్రమే కోల్పోయింది. ఈ గ్రూప్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 1,748 కోట్లు, టీవీ 18 బ్రాడ్ కాస్ట్ రూ. 704 కోట్లు నష్టపోయాయి. ఇక మార్కెట్ క్యాప్ శాతం పరంగా పరిశీలిస్తే, శ్రీరామ్ గ్రూప్ అత్యధికంగా 21 శాతం నష్టపోయింది. ఆపై పిరామల్ గ్రూప్ 14 శాతం, ముంజాల్ గ్రూప్ 13.52 శాతం, ఓపీ జిందాల్ గ్రూప్ 10 శాతం, మురుగప్పా గ్రూప్ 10 శాతం, అదానీ గ్రూప్ 9.83 శాతం నష్టపోయాయి.