: 15 ఏళ్ల తర్వాత తిరుమల వెళుతున్న కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 15 సంవత్సరాల తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళుతున్నారు. ఈ సందర్భంగా, తెలంగాణ రాష్ట్ర సాధన కలను నెరవేర్చినందుకు శ్రేవేంకటేశ్వరుడికి మొక్కు చెల్లించుకోనున్నారు. దాదాపు రూ. 5 కోట్ల విలువైన ఆభరణాలను టీఎస్ రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి ఆయన కానుకగా సమర్పించనున్నారు. కాగా, ఈ నెలాఖరులో ఆయన తిరుమల వెళతారు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా తిరుమలకు వెళుతున్నారు. చివరిసారిగా 2001లో కేసీఆర్ తిరుమలకు వెళ్లారు. ఇదే సమయంలో ఆయన కుటుంబ సభ్యులు మాత్రం పలుమార్లు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. మరోవైపు, అమరావతి శంకుస్థాపన కార్యక్రమం జరిగిన తర్వాత తొలిసారి కేసీఆర్ ఏపీలో అడుగుపెట్టబోతున్నారు. ఏపీ రాజధాని శంకుస్థాపనకు కేసీఆర్ హాజరైన సంగతి తెలిసిందే.