: వేధింపుల కేసు నుంచి హాలీవుడ్ సూపర్ స్టార్ కు విముక్తి
హాలీవుడ్ బెస్ట్ కపుల్స్ గా పేరొందిన బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీలు తమ వివాహ బంధానికి ముగింపు పలుకుతూ, గత సెప్టెంబర్ లో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తన పిల్లల్ని వేధించాడంటూ బ్రాడ్ పిట్ పై కేసు నమోదైంది. గత సెప్టెంబర్ లో ప్రైవేట్ జెట్ విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో... జోలీ మీద ఉన్న కోపాన్ని పిల్లలపై ప్రదర్శించాడని పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే, వేధింపులకు బ్రాడ్ పిట్ పాల్పడినట్లు ఆధారాలు లభ్యమయ్యే అవకాశాలు లేవంటూ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ కేసు దర్యాప్తును నిలిపివేసింది. మరోవైపు, లాస్ ఏంజెలెస్ కౌంటీ చైల్డ్ అండ్ ఫ్యామిలీ సర్వీసెస్ శాఖ కూడా నవంబర్ మొదటి వారంలోనే బ్రాడ్ పిట్ కు క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో, వేధింపుల కేసు నుంచి హాలీవుడ్ సూపర్ స్టార్ కు ఊరట లభించినట్టైంది. ప్రస్తుతం వీరి పిల్లలు మలీబులో ఉన్న ఇంట్లో తల్లి జోలీతో కలసి ఉంటున్నారు.