: బ్యాంక్ ముందు నిలబడ్డ ప్రజలపై కర్కశంగా ప్రవర్తించిన ఎస్పీ సస్పెన్షన్
డబ్బు మార్చుకునేందుకు గంటలు గంటలు బ్యాంకుల ముందు పనులు వదులుకుని వచ్చి మరీ నిలబడ్డ ప్రజల్లో కొందరు అసహనానికి గురవుతుంటే, వారికి సర్దిచెప్పాల్సిన బాధ్యతను పక్కనబెట్టి, లాఠీలకు పని కల్పించి కర్కశంగా ప్రవర్తించిన పోలీసులపై వేటు పడింది. లక్నోలో ఓ బ్యాంకు వద్ద ఎస్పీ, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు బ్యాంకు ముందున్న వారిని లాఠీలతో కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, ఈ ఇద్దరినీ సస్పెండ్ చేస్తున్నట్టు ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. ఫత్తేపూర్ ఎస్పీ రామ్ కిషోర్, కిషన్ పూర్ ఎస్హెచ్ఓ సంజయ్ కుమార్ లను సీఎం ఆదేశాల మేరకు సస్పెండ్ చేసినట్టు పోలీసు శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రజలకు సహకరించాల్సిన పోలీసులు, ఇలా వారికి కష్టాలు పెరిగేలా చేయడం, వారిని నిర్దయగా కొట్టడం క్షమించరాని నేరమని ఈ సందర్భంగా అఖిలేష్ వ్యాఖ్యానించారు.