: ఏటీఎం క్యూలో మీకోసం మేం నిలబడతాం.. గంటకు రూ.90 మాత్రమే.. 'బుక్ మై చోటు' ఆఫర్!
పెద్ద నోట్ల రద్దుతో డబ్బులు డ్రా చేసుకునేందుకు, పాత నోట్లను మార్చుకునేందుకు ప్రజలు ఏటీఎంలు, బ్యాంకుల వద్ద క్యూలలో పడరాని పాట్లు పడుతున్నారు. గంటల తరబడి క్యూలలో నిల్చోవడం వల్ల సమయం వృథా అవుతోందని చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి కష్టాలు తీర్చేందుకు ముందుకొచ్చింది 'బుక్‌మైచోటు డాట్ కామ్' అనే స్టార్టప్ కంపెనీ. గంటకు రూ.90 చెల్లిస్తే మీ తరపున క్యూలో నిల్చునేందుకు వ్యక్తిని పంపిస్తామంటూ ప్రకటించింది. ప్రజల క్యూకష్టాలను తీర్చేందుకు వినూత్న ఆలోచనతో ముందుకొచ్చిన బుక్‌మై చోటులో హెల్పర్‌ను బుక్ చేసుకోవాలంటే ఆన్‌లైన్‌లో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. లేదంటే +91-8587028869 అనే నంబరుకు కాల్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి 'బుక్‌మై చోటు' సేవలు ఉత్తరప్రదేశ్, హరియాణా, ఢిల్లీలో అందుబాటులో ఉన్నాయి. బుక్ మై చోటు అనగానే తామేదో చిన్నపిల్లలను సరఫరా చేస్తామని అనుకోవద్దని క్యూలలో నిల్చునేందుకు 18 ఏళ్లు నిండిన వ్యక్తులనే పంపిస్తామని సంస్థ పేర్కొంది. ఈ సేవలు ఒక్క క్యూలైన్లకే పరిమితం కాదు.. ఇల్లు మారడం దగ్గరి నుంచి ఇంటికి సరుకులు తెచ్చివ్వడం వరకు అన్నింటికీ ఈ సైట్ ద్వారా హెల్పర్లను బుక్ చేసుకోవచ్చు. బ్యాంకులు, ఏటీఎం క్యూలలో నిల్చునేందుకు బుక్ చేసుకున్న వారు చివరి నిమిషంలో తప్పకుండా బ్యాంకు, ఏటీఎం వద్దకు రావాల్సిందేనని స్పష్టం చేసింది. తాము పంపిన వ్యక్తులు కేవలం లైన్లో మాత్రమే నిల్చుంటారని పేర్కొంది. సత్‌జీత్ సింగ్ బేడీ, గోవిన్ కందారి అనే ఇద్దరు కలిసి ఈ సంస్థను ప్రారంభించారు.