: ‘బాహుబలి-2’లో సన్నివేశాలు తస్కరించిన గ్రాఫిక్ డిజైనర్ కృష్ణ అరెస్టు
‘బాహుబలి-2’ చిత్రంలో కొన్ని సన్నివేశాలను తస్కరించిన గ్రాఫిక్ డిజైనర్ కృష్ణను విజయవాడలో పోలీసులు అరెస్టు చేశారు. అన్నపూర్ణ స్టూడియోలో ‘బాహుబలి-2’ ఎడిటింగ్ విభాగంలో కృష్ణ పనిచేస్తున్నాడు. ఈ చిత్రంలోని 9 నిమిషాల నిడివి గల సన్నివేశాలను తస్కరించాడని కృష్ణపై హైదరాబాదు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్, సైబర్ క్రైం పోలీసులకు ఈ చిత్ర నిర్మాతలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, నిందితుడిని అరెస్టు చేశారు. కాగా, ‘బాహుబలి-2’ చిత్రంలో సన్నివేశాలు ఆన్ లైన్ లో ప్రత్యక్షం కావడంతో చిత్ర బృందం కంగుతింది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలు పోషించిన ‘బాహుబలి’ చిత్రం రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. ‘బాహుబలి’ కొనసాగింపుగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి-2’ వచ్చే ఏడాది ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.