: పెద్దనోట్ల రద్దు ప్రభావంతో 13 రోజుల్లో 70 మంది మృతి: కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జివాలా
పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనాలోచితమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జివాలా మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూల్లో నిలబడుతూ నానా ఇబ్బందులు పడుతున్నారని, పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో 13 రోజుల్లో 70 మంది మృతి చెందారని పేర్కొన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని ఆయన అన్నారు. భారత దేశాన్ని మోదీ సర్కారు మళ్లీ వెనక్కి తీసుకెళుతోందా? అని ఆయన ప్రశ్నించారు. దేశంలో ఉన్న డబ్బులో 86 శాతం నల్లధనం రూపంలో ఉందని మోదీ అన్నట్లు వార్తలు వస్తున్నాయని, ఈ వ్యాఖ్యని మోదీ అనుంటే అంతకన్నా అవమానకర ప్రకటన మరొకటి ఉండదని రణదీప్ సూర్జివాలా వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం సామాన్యులు దాచుకున్న డబ్బుపై నియంత్రణ విధించడం మంచి పద్ధతి కాదని ఆయన అన్నారు.