: నయీం డైరీలో మరో ఇద్దరు పోలీసు అధికారుల పేర్లు
ఎన్ కౌంటర్లో చనిపోయిన గ్యాంగ్ స్టర్ నయీంతో సంబంధాలు ఉన్న వ్యక్తుల పేర్లు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా, చర్లపల్లి జైలు అధికారుల పేర్లు నయీం డైరీలో దొరికాయి. డిప్యూటీ సూపరింటెండెంట్ రాజమహేష్, జైలర్ దేవుల పేర్లు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో, రాజమహేష్ ను సిట్ అధికారులు నాలుగు గంటల పాటు విచారించారు. 2013లో నల్గొండ జిల్లా జైలు అధికారిగా మహేష్ పనిచేశాడు. ఆ సందర్భంగా, మహేష్ కు రూ. 27 లక్షలు ఇచ్చినట్టు నయీం తన డైరీలో రాసుకున్నాడు. ఆ సమయంలో, మాజీ మావోయిస్టు సాంబశివుడు హత్య కేసులో నయీం జైల్లో ఉన్నాడు. ఆ సమయంలో, నయీంకు, అతని అనుచరులకు మహేష్ రాజభోగాలు కల్పించాడు. దీనికి సంబంధించి, సిట్ అధికారులు బలమైన ఆధారాలు సేకరించినట్టు సమాచారం. ఏ క్షణమైనా మహేష్ ను సిట్ అధికారులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. నయీం కేసు విచారణను సిట్ అధికారులు వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పలువురు రాజకీయ నేతల పేర్లు కూడా వినిపించాయి.