: నల్లధనాన్ని మార్చేందుకు నిరాకరించిన పెట్రోలు బంకు ఉద్యోగిపై వేటు.. పశ్చిమగోదావరిలో ఘటన
నల్లధనాన్ని మార్చేందుకు నిరాకరించిన ఓ ఉద్యోగి తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఈ ఘటన చోటుచేసుకుంది. పోడూరు మండలం జిన్నూరు నరసింహారావుపేటకు చెందిన యువకుడు పాలకొల్లులోని ఓ పెట్రోలు బంకులో పనిచేస్తున్నాడు. పెద్ద నోట్ల రద్దుతో ఉక్కిరిబిక్కిరి అయిన బంక్ యజమానుల్లో ఒకరు ఆ యువకుడికి రూ.2.35 లక్షల విలువైన రూ.500, రూ.1000 నోట్లు ఇచ్చి తన ఖాతాలో వేసుకోవాల్సిందిగా సూచించాడు. కొంతకాలం తర్వాత వాటిని తీసుకుంటానని చెప్పాడు. అసలు లావాదేవీలే ఉండని తన ఖాతాలో ఒకేసారి అంతపెద్ద మొత్తం జమచేస్తే చిక్కుల్లో పడాల్సి వస్తుందని భయపడిన ఉద్యోగి ఆ డబ్బును తన ఖాతాలో వేసుకునేందుకు నిరాకరించాడు. దీనిని తీవ్రంగా పరిగణించిన యజమాని అతడిని ఉద్యోగం లోంచి తొలగించాడు. విషయం బయటకు రావడంతో బంకు యజమాని తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డబ్బులు వేయలేదని ఉద్యోగి పొట్టకొట్టడం అన్యాయమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యువకుడిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.