: ట్రంప్ గెలుపు తర్వాత అమెరికాలో పెరిగిన విద్వేషపూరిత దాడులు
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నకైన తర్వాత ఆ దేశంలో విద్వేషపూరిత దాడులు పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు 200కు పైగా విద్వేషపూరిత దాడులు, బెదిరింపులు చోటు చేసుకున్నాయి. తాజాగా, ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్శిటీలో మొదటి సంవత్సరం చదువుతున్న హర్మీన్ సింగ్ ను ఓ వ్యక్తి బెదిరించాడు. ముస్లిం అనుకొని అతను ఈ దాడి చేశాడు. హర్మీన్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం... అతను కేంబ్రిడ్జ్ లోని ఓ దుకాణంలో షాపింగ్ చేస్తుండగా, ఓ వ్యక్తి 'నువ్వు ముస్లింవి' అంటూ వేధించడం ప్రారభించాడు. అంతేకాదు, ఎక్కడ ఉంటావంటూ హర్మీన్ పైకి దూసుకొచ్చాడు. షాపులో ఎంతో మంది ఉన్నప్పటికీ, ఎవరూ కూడా అతడిని ఆపే ప్రయత్నం చేయలేదు. ఆ సమయంలో తన తల్లితో ఫోన్ లో మాట్లాడుతున్నాడు హర్మీన్. ఫోన్ లో వినపడుతున్న సంభాషణతో ఆమె కూడా కంగారు పడ్డారు. ఈ వివరాలను 'ది బోస్టన్ గ్లోబ్' పత్రికకు తెలిపాడు హర్మీన్. అంతేకాదు, గత వారంలో కూడా ఓ వ్యక్తి తనను ముస్లిం అంటూ దూషించినందుకు అతనితో హర్మీన్ గొడవపడ్డాడు.