: కరెంట్, ఓవర్ డ్రాఫ్ట్, క్యాష్ క్రెడిట్ ఖాతాలు కలిగిన వారికి విత్ డ్రా పరిమితి పెంపు.. రైతులకూ ఊరట!
పెద్దనోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు ఆర్‌బీఐ వేగంగా చర్యలు తీసుకుంటోంది. కనీసం మూడు నెలల నుంచి కరెంట్, ఓవర్ డ్రాఫ్ట్, క్యాష్ క్రెడిట్ ఖాతాలు కలిగిన ప్రజలకి విత్ డ్రా పరిమితిని పెంచుతున్నట్లు, ఇకపై వారు వారంలో రూ. 50 వేలవరకు నగదు తీసుకోవచ్చని పేర్కొంది. వారికి కొత్తగా విడుదల చేసిన రెండు వేల రూపాయల నోట్లను ఇవ్వాలని సూచించింది. అయితే, వ్యక్తిగత ఓవర్ డ్రాఫ్ట్ ఖాతాలు కలిగిన వినియోగదారులకు మాత్రం ఈ సదుపాయం ఉండబోదని చెప్పింది. మరోవైపు రైతులు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా వారికి అనుకూలంగా ఆర్‌బీఐ మరో ప్రకటన జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర విత్తన సంస్థలు, వ్యవసాయ వర్సిటీలు, ఐసీఏఆర్ సంస్థకు సంబంధించిన దుకాణాల్లో గుర్తింపు కార్డు చూపించి పాత 500 నోట్లతో కూడా విత్తనాలు కొనుగోలు చేసుకోవచ్చని ప్రకటించింది. ఇక ప్రభుత్వం ఇటీవల చేసిన ప్రకటనలో భాగంగా వివాహ వేడుకల కోసం రేపటి నుంచి రూ.2.5 లక్షల విత్ డ్రా చేసుకోవచ్చని తెలిపింది.