: రెండువేల రూపాయల నోటును చట్టవిరుద్ధంగా తీసుకువచ్చారు: ఆనంద్ శర్మ
పెద్దనోట్ల రద్దు అంశంలో విపక్షాలు చేస్తోన్న ఆందోళనతో లోక్‌సభ ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. అయితే, పార్లమెంటు వెలుపల కాంగ్రెస్ నేతలు తమ నిరసనను కొనసాగించారు. ప్రధాని మోదీ రెండువేల రూపాయల నోటును చట్టవిరుద్ధంగా తీసుకువచ్చారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. దేశంలో ఆర్థిక అరాచకత్వం కొనసాగుతోందని అన్నారు. పెద్దనోట్ల రద్దుపై పార్లమెంటు లోపల, వెలుపలా మోదీ సర్కారుపై గళమెత్తుతామని చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ మాట్లాడుతూ... భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం ప్రకారం కొత్త నోట్ల ముద్రణ కోసం నోటీఫికేషన్ జారీ చేసి, అనంతరం వాటిని విడుదల చేయాల్సి ఉండగా దానికి విరుద్ధంగా కొత్త నోట్లను తీసుకొచ్చారని అన్నారు. ఈ అంశంపై తాము ప్రజలతో కలిసి పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పారు.