: చంద్రబాబు లేఖల ఫలితం.. రిజర్వు బ్యాంకు నుంచి ఏపీకి అందిన రూ.2,200 కోట్లు.. నేడు అన్ని జిల్లాలకు పంపిణీ
నోట్ల రద్దు తర్వాత ప్రజలు పడుతున్న ఇబ్బందులను త్వరితగతిన పరిష్కరించేందుకు నడుంబిగించిన రిజర్వు బ్యాంకు అందుకు అనుగుణంగా చర్యలు ప్రారంభించింది. రాష్ట్రాలకు పెద్ద మొత్తంలో డబ్బులు సరఫరా చేస్తూ ప్రజలను కష్టాల నుంచి గట్టెక్కించే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,200 కోట్లు సరఫరా చేసింది. నేడు (ఆదివారం) ఆ సొమ్మును అన్ని జిల్లాలకు పంపిణీ చేయనుంది. నగదు రవాణా కోసం తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా రాష్ట్రప్రభుత్వాన్ని కోరింది. వాహనాలు, భద్రతా సిబ్బందిని నియమించాలని విజ్ఞప్తి చేసింది. రాష్ట్రానికి చేరుకున్న కరెన్సీని అధికారులు వివిధ బ్యాంకు శాఖలు, ఏటీఎంలకు పంపిణీ చేయనున్నారు. ఆర్బీఐ నుంచి పెద్ద మొత్తంలో నగదు రాష్ట్రానికి చేరుకోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వీలైనంతగా డబ్బులు పంపాలంటూ చంద్రబాబు పలుమార్లు ఆర్బీఐ, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీలకు లేఖలు రాసిన సంగతి తెలిసిందే. మొన్న కూడా మరో రూ.10 వేల కోట్లు పంపాలని లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ రూ.2,200 కోట్లు పంపడం ప్రజలకు ఊరటనిచ్చింది.